
సీపీఎస్‌ను తక్షణమే రద్దు చేయాలి
శ్రీకాకుళం: ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం విధానం రద్దు చేసి పాత పింఛన్ విధానం అమలుచేయాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ సలహాదారు పోతల దుర్గారావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ విజ్ఞాన మందిరంలో ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బదిలీ ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలని కోరారు. యాప్‌ల విధానాన్ని రద్దు చేసి ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించాలన్నారు. పీఆర్సీని ప్రకటించాలని, విశ్రాంత ఉద్యోగుల బెనిఫిట్స్‌ను విడుదల చేయాలని, పీఎఫ్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు, ఇతర లీవ్‌లు మంజూరు చేయాలని కోరారు.
ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం..
అధ్యక్షుడిగా ఎండీ సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అన్ను వెంకటరావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా కొప్పల డేనియల్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా బొంత సుబ్బారాయుడు, రాష్ట్ర కోశాధికారిగా ఆవల అప్పన్న, రాష్ట్ర మీడియా కన్వీనర్‌గా అంబటి ఆదినారాయణ, రాష్ట్ర సహాధ్యక్షుడిగా భూపతి రవికుమార్, కింజరాపు నూకరాజులను ఎన్నుకున్నారు. శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా ఆవల అప్పన్న, ప్రధాన కార్యదర్శిగా కింజరాపు నూకరాజులు ఎంపికయ్యారు.