
169 మందికి అవార్డులు
శ్రీకాకుళం పాత బస్టాండ్: స్వాతంత్య్ర వేడుకలు ఉదయం 8.30 నుంచి ప్రారంభం కానున్నాయి. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా 169 మందికి ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు ఇవ్వనున్నారు. ఈ మేరకు గురువారం రాత్రి కలెక్టర్ జాబితా విడుదల చేశారు.
ఇంకేం అర్హత కావాలి..?
చిత్రంలో కనిపిస్తున్న దివ్యాంగుడి పేరు దాసరి కరువయ్య. పొందూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన ఈయన చిన్నతనం నుంచి పోలియోతో బాధ పడుతున్నాడు. తన ఎడమ చేయి పూర్తిగా పనిచేయదు. ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌పైనే ఆధారపడి బతుకుతున్నాడు. ఇటీవల ఆయనకు ప్రభుత్వం ఓ నోటీసు పంపించింది. పింఛన్ ఇచ్చేంత వైకల్యం లేదని అందులో పేర్కొంది. ఇకపై పింఛన్ కూడా రాదంటూ సచివాలయ సిబ్బంది చెప్పేశారు. దీంతో ఆయన ఎంపీడీఓ వద్దకు వచ్చి ఇలా ఆవేదన వెలిబుచ్చారు. ఈ వైకల్యం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. – పోలాకి
లోలుగు కేజీబీవీలో
ఆర్‌జేడీ విచారణ
పొందూరు: మండలంలోని లోలుగు కేజీబీవీలో ఇటీవల బదిలీ అయిన ప్రిన్సిపాల్ ఆర్.సౌమ్యపై, పాఠశాలపై వచ్చిన పలు ఆరోపణలపై గురువారం కాకినాడ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జి.నాగమణి విచారణ జరిపారు. ఈ సందర్భంగా పాఠశాలలోని టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌ని ఒక్కొక్కరుగా పిలిచి విచారణ జరిపారు. ఒక ప్రశ్న పత్రాన్ని ఇచ్చి వాటికి సమాధానాలను రాతపూర్వకంగా తీసుకున్నారు. అలాగే పాఠశాలలో గల భోజన, వసతి సౌకర్యాలతో పాటు ఉపాధ్యాయులు, బోధనకు సంబంధించి పాఠశాలలోని సుమారు 287 మంది విద్యార్థినులకు తెల్ల కాగితాలను ఇచ్చి వారితో సమాధానాలు రాయించారు. అనంతరం రికార్డులను ఆమె పరిశీలించారు. ఆమెతో పాటు ప్రిన్సిపాల్ ఎస్.లలితకుమారి తదితరులు పాల్గొన్నారు.
పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానం వేదికగా శుక్రవారం జరగనున్న జిల్లాస్థాయి వేడుకలకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. గురువారం వాన పడడంతో శకటాల సన్నద్ధత పనులకు కాస్త ఆటంకం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ ప్రకటనతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన వేదికతోపాటు వీఐపీలు, వీవీఐపీలు, ప్రెస్‌అండ్ మీడియా, సాంస్కృతిక కార్యక్రమాలు, స్వా తంత్య్ర సమరయోధులు, వీక్షకులు ఇలా వేర్వేరుగా షామియానాలను సిద్ధం చేస్తున్నారు. పలు మార్గాల్లో ట్రాఫిక్ నిబంధనలను ఏర్పాటు చేశారు.

169 మందికి అవార్డులు