
జెడ్పీటీసీ ఉప ఎన్నికకు ఇన్ని కుతంత్రాలా..?
నరసన్నపేట: కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా కూటమి నాయకుల వైఖరిని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా ఖండించారు. దౌర్జన్యాలు, అక్రమాలు, ఓటర్లను భయపెట్టడాలు, వైఎస్సార్‌సీపీ నాయకుల అక్రమ అరెస్టులపై ఆయన ధ్వజమెత్తారు. ‘ఎన్నికలు ఎందుకు నిర్వహించడం.. జెడ్పీటీసీలను నామినేట్ చేసుకోండి.. ఎన్నికల పేరిట ఇంతకు దిగజారాలా’ అని ప్రశ్నించారు. ఆయన మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తీవ్రంగా విమర్శించారు. జెడ్పీటీసీ అభ్యర్థిని కూడా ఓటు వేయనీయకుండా అడ్డుకోవడం దిగజారిన పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. చంద్రబాబు పాలన హిట్లర్ నియంత పాలన ను మరిపిస్తోందన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడం, పోలీసు బలగాలు టీడీపీ నాయకులకు కొమ్ము కాయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఎరువు అందక, నీరు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే కూటమి నాయకులు సంబరాల ర్యాలీలు చేయడం వారి పైత్యానికి నిదర్శనమన్నారు.