ఆగిన ఆశల సౌధం..! | - | Sakshi
Sakshi News home page

ఆగిన ఆశల సౌధం..!

Aug 12 2025 11:25 AM | Updated on Aug 12 2025 11:25 AM

ఆగిన

ఆగిన ఆశల సౌధం..!

జిల్లాలో గత ప్రభుత్వంలో...

● మంజూరైన మొత్తం ఇళ్లు – 81,262

● జగనన్న కాలనీ లే అవుట్‌లు – 784

● జగనన్న కాలనీల్లో మంజూరైన ఇళ్లు – 33,295

● పలు స్కీముల ద్వారా మంజూరైన ఇళ్లు – 47,967

● నిర్మాణం పూర్తయిన ఇళ్లు – 44,930

● పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలు – 36,332

● పనులు ప్రారంభం కాని ఇళ్లు – 17,268

● బేస్‌మెంట్‌ లెవెల్‌లో ఉన్న ఇళ్లు – 7,921

● ఆర్‌ఎల్‌ స్థాయిలో ఉన్న ఇళ్లు – 4,434

● గుంతల తవ్వి వదిలేసిన ఇళ్లు – 3,930

● శ్లాబ్‌ పూర్తయిన ఇళ్లు – 2,772

వజ్రపుకొత్తూరు రూరల్‌: ప్రతి పేదవాడికి సొంతిళ్లు ఉండాలనే లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అర్హులైన పేదలకు ఇంటిస్థలం అందించి జగనన్న కాలనీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేయడంతో పాటు నిర్మాణాలకు సంబంధించి మహిళలకు రుణ సదుపాయం సైతం అప్పటి ప్రభుత్వం కల్పించింది. దీంతో కాలనీల్లో వేగవంతంగా నిర్మాణాలు చేపట్టారు. చాలామంది ఇళ్లను నిర్మించుకొని సొంతిట్లో ఆనందంగా గడుపుతున్నారు. అలాగే సొంత స్థలాల్లో సైతం పలువురు ఇళ్ల నిర్మాణాలకు పూనుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల ఇళ్లపై శీతకన్ను వహిస్తోంది. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కొంతమంది లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణం చేపడుతున్న తరుణంలో ఎన్నికలు వచ్చాయి. అయితే అనంతరం వచ్చిన కూటమి ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల్లో మోకాలడ్డుతోంది. దీంతో ప్రస్తుతం లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.

వైఎస్సార్‌సీపీ హయాంలో...

వైఎస్సార్‌సీపీ హయాంలో జిల్లావ్యాప్తంగా 81,262 మంది లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశారు. ప్రభుత్వం గృహ నిర్మాణశాఖ ద్వారా రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి చేసింది. అలాగే ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి సంబంధించి రూ.1.80 లక్షలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. అంతేకాకుండా మహిళా సంఘాల నిధుల్లో మహిళ లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా మరో రూ.35 వేల రుణ సదుపాయం కల్పించింది. అలాగే ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్‌ను తక్కువ ధరలో అందించారు. నాణ్యమైన ఇంటి సామాగ్రిని సైతం అందించి లబ్ధిదారులకు అండగా నిలిచింది. దీంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపి, శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకొని వారి సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారు.

వెబ్‌సైట్‌లో మార్పు.. లబ్ధిదారుల నిట్టూర్పు

గత ప్రభుత్వం వినియోగించిన గృహ నిర్మాణశాఖ వెబ్‌సైట్‌ను అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం లాక్‌ చేసింది. వెబ్‌సైట్‌ను సైతం మార్పులు చేసి లబ్ధిదారులకు నిట్టూర్పు మిగిల్చింది. లబ్ధిదారుల దరఖాస్తు, ఎంపిక, బిల్లు చెల్లింపులో జాప్యం కలిగేలా ప్రభుత్వ వైఖరి ఉందని, దీంతో తమ సొంతింటి కల నెరవేరడం లేదని పలువురు అందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి కొత్త ఇళ్లను మంజూరు చేయాలని, పెండింగ్‌లో ఉన్న బిల్లును అందించాలని కోరుతున్నారు.

డిసెంబర్‌లోగా పూర్తి చేయాలి

ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు డిసెంబర్‌లోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలి. ఇళ్ల నిర్మాణం కోసం గత ప్రభుత్వం అందించిన రూ.1.80 లక్షలతో పాటు అదనంగా బీసీ, ఎస్సీ లబ్ధిదారులకు రూ.50 వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75 వేలను ప్రస్తుత ప్రభుత్వం అందిస్తుంది. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇళ్లు నిర్మాణం చేస్తే బిల్లులు అందిస్తున్నాం.

– అప్పారావు,

గృహ నిర్మాణశాఖ పీడీ, శ్రీకాకుళం

కూటమి ప్రభుత్వంలో ఆగిన ఇళ్ల నిర్మాణాలు

కొత్త ఇళ్ల మంజూరుకు మోకాలడ్డు

నిర్మాణాలకు బిల్లుల చెల్లింపులు నిలిపివేత

జగనన్న కాలనీలపై వివక్ష

లబోదిబోమంటున్న లబ్ధిదారులు

కాలనీలపై కూటమి కక్ష

జగనన్న కాలనీల్లో కూటమి ప్రభుత్వం వచ్చేనాటికి చేపడుతున్న నిర్మాణాలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. బిల్లుల చెల్లింపులు లేకపోవడంతో పాటు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేకపోవడంతో ఇంటి నిర్మాణాలు ప్రస్తుతం మొండి గోడలతో దర్శనమిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మరోవైపు ఇంటి నిర్మాణాలు జరగని కొన్నిచోట్ల ఆ స్థలంపై కూటమి నాయకుల కన్ను పడింది. వాటిని కబ్జా చేసేందుకు పన్నాగాలు పన్నుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే కొంతమంది లబ్ధిదారుల నుంచి చౌకగా ఇంటి స్థలాన్ని లాక్కొనే ప్రయత్నాలు కుడా జరుగుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కాలనీల్లో మౌలిక సదుపాయాలను కల్పించుకుండా కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది.

ఆగిన ఆశల సౌధం..! 1
1/1

ఆగిన ఆశల సౌధం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement