అర్జీలు సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు సత్వరమే పరిష్కరించాలి

Aug 12 2025 11:17 AM | Updated on Aug 12 2025 11:25 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: అర్జీలు పెండింగ్‌లో లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)లో 86 వినతులు స్వీకరించారు. వీటిలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం, రెవెన్యూ (సీసీఎల్‌ఏ) విభాగం, వ్యవసాయ శాఖ, ఈస్ట్రన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌, సర్వే, ల్యాండ్‌ రికార్డ్స్‌, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ యాజమాన్యం, సామాజిక సంక్షేమం, ఎండోమెంట్స్‌, నీటిపారుదల, పరిశ్రమలు, గృహ నిర్మాణం, సమగ్ర శిక్ష, ప్రజారోగ్యం, నైపుణ్యాభివద్ధి, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌, గ్రామ వలంటీర్లకు సంబంధించిన వినతులు ఉన్నారు. స్వీకరించిన అన్ని వినతుల పరిష్కారానికి సంబంధిత శాఖాధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

ఫిర్యాదులను పరిశీలిస్తే...

● వంశధార కాలువ ద్వారా పలాస నియోజకవర్గంలోని శివారు ప్రాంతాలకు సాగునీరు రావడం లేదని, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాలువ నీరు ఎంతో అవసరం ఉందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. తమ నియోజకవర్గానికి కాలువ ద్వారా సాగునీరు అందించాలని కోరారు. ఎగువనున్న నరసన్నపేట, టెక్కలి ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో కాలువ గేట్లు రాత్రికి రాత్రి ఎత్తివేసి, పలాస నియోజకవర్గానికి సాగునీరు రాకుండా చేస్తున్నారని ఆమె వాపోయారు.

● శ్రీకాకుళం పట్టణంలోని సర్వే నంబర్‌ 190/2లో ప్రభుత్వ పురుషుల డిగ్రీ రోడ్డులో వికాస్‌ స్కూల్‌ దగ్గర బలగ వార్డు స్థలంలో డాక్టర్‌ గొండు గంగాధర్‌ అక్రమ నిర్మాణం చేపడుతున్నాడని, నిర్మాణ పనులు ఆపమని ఉన్నత న్యాయస్థానం చెప్పినా పట్టించుకోవడం లేదని శాంతి నగర్‌కు చెందిన లోతుగెడ్డ కృష్ణవేణి భర్త లోతుగెడ్డ శ్రీరామ దూతం గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు. గంగాధర్‌ స్థానిక ఎమ్మెల్యే సోదరుడు కావడంతో అధికారులు సహకరిస్తున్నారని, అందువలన నిర్మాణ పనుల నిలుపుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు.

● శ్రీకాకుళం మండలం బలగ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్‌ 1/4, 1/5 లో ఉన్న కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బలగకు చెందిన బోనెల చిరంజీవి గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు. సుమారు 1.80 ఎకరాల నాగావళి వరద గట్టు (ప్రభుత్వ భూమి)కి కంచె వేసి కబ్జా చేశారని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు.

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

పీజీఆర్‌ఎస్‌కు 86 వినతులు

సామాన్యులకు ఇబ్బందులు

అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు నేరుగా జిల్లా పరిషత్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్దకు వచ్చి వారి ఫిర్యాదులు ఇచ్చి వెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ వారు నేరుగా జెడ్పీ సమావేశ మందిరంలోని వెయిటింగ్‌ హాల్‌లో కలెక్టర్‌, జేసీను ఉంచి వారి ఫిర్యాదులను వివరిస్తే.. ప్రజాప్రతినిధుల కోసం గంటల సమయం కేటాయిస్తే మిగిలిన సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పవు. అదే పరిస్థితి ఈ సోమవారం పీజీఆర్‌ఎస్‌లో చోటు చేసుకుంది. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ పలు ఫిర్యాదులతో గ్రీవెన్స్‌ జరుగుతున్న సమయంలో జిల్లా పరిషత్‌కు రావడం జరిగింది. దీంతో అక్కడ ఉన్న వెయిటింగ్‌ హాల్‌కు ఆయన కోసం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌లు వెళ్లి సుమారుగా గంట కాలం వెచ్చించారు. దీంతో వచ్చిన అర్జీదారులు ద్వితీయ స్థాయి అధికారులకు వారి సమస్యలు విన్నవించుకునేందుకు ఇష్టపడక గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సైతం అర్జీ ఇచ్చేందుకు వచ్చి దాదాపు 30 నిమిషాలు పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

అర్జీలు సత్వరమే పరిష్కరించాలి 1
1/1

అర్జీలు సత్వరమే పరిష్కరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement