పట్టాదారులు.. ముగ్గురు | - | Sakshi
Sakshi News home page

పట్టాదారులు.. ముగ్గురు

Aug 11 2025 7:25 AM | Updated on Aug 11 2025 7:25 AM

పట్టాదారులు.. ముగ్గురు

పట్టాదారులు.. ముగ్గురు

● స్థలం.. ఒకటి

పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో భూ అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా ఉంది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్కడ పాగా వేసేస్తున్నారు. పాత జాతీయ రహదారి సమీపంలోని జీఎంఈ కాలనీ ఎదురుగా సుమారు రూ.కోటి 50లక్షలు విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపాలిటీ డంపింగ్‌ యార్డుకు వెళ్లే రోడ్డు పక్కన ఇంగిలిగాం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్‌ 292లో సుమారు 50 సెంట్లు భూమి ఉంది. కొన్నేళ్లుగా ఆ ప్రాంతం పిచ్చి మొక్కలతో పనికి రాని విధంగా ఉండేది. ఇటీవల ఆ ప్రాంతంలో పిచ్చి మొక్కలు తొలగించి నేలను చదును చేసి దాని చుట్టూ గోడ నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పాత జాతీయ రహదారికి ఆనించి ఉన్న ఈ భూమి నేడు కోట్లాది రూపాయలు విలువ చేస్తుండడంతో ఓ ముగ్గురు దానిపై కన్నేసినట్లు సమాచారం. వారంతా తమకు ప్రభుత్వం ఇచ్చిన డీ పట్టాలు ఉన్నా యని చెబుతూ అక్కడ తగువులు పడుతుండటంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో తెలుగు దేశం పార్టీకి అనుకూలమైన నాయకుడు కూడా ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు పలాస తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి అది తన స్థలమని, తన వద్ద పట్టా ఉందని చెబుతుండటం గమనార్హం. ఈ విధంగా ముగ్గురు వ్యక్తులు ఆ స్థలం కోసం గొడవలు పడి రోడ్డున పడటంతో అధికారులు కూడా స్థల పరిశీలన చేశారు. అయితే అక్కడ నిర్మాణంలో ఉన్న గోడ ఇప్పటికీ అలాగే ఉంది. ఆ స్థలం ఎవరిదన్నది నేటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఒక వేళ ఎవరికై నా ప్రభుత్వం పట్టా ఇచ్చి ఉంటే ఇంత వరకు ఆ స్థలాన్ని అలాగే పిచ్చి మొక్కలతో ఎందుకు వదిలేశారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అసలే అది ప్రభుత్వం భూమి. ముగ్గురికి పట్టాలు ఎలా ఉన్నాయని సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

పలాస సీతంతల్లి గుడికి వెళ్లే తోవలోని శ్రీనివాస్‌నగర్‌లో ఒక చెరువును పూర్తిగా ఆక్రమించి తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఇళ్లను నిర్మించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో కూడా రెవెన్యూ అధికారులు గానీ, మున్సిపల్‌ అధికారులు గానీ పట్టించుకోకపోవడం విశేషం. అలాగే రామకృష్ణాపురం వద్ద గల జగనన్న కాలనీ వద్ద గల కొండను తవ్వేసి సుమారు 60 సెంట్లు స్థలాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నాయకుడు ఆక్రమించుకున్నట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక పోతే పద్మనాభపురం కాలనీ వద్ద గల శనీశ్వర దేవాలయం సమీపంలో మరో ఇద్దరు తెలుగు దేశం పార్టీ నాయకులు సుమారు 20 సెంట్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని అక్కడ స్థానికులు ఆరోపిస్తున్నాయి. ఈ విధంగా మున్సిపాలిటీలో ప్రభుత్వ భూములను అడ్డు అదుపు లేకుండా ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వీటిపై దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

పలాస కాశీబుగ్గలో భూ బాగోతం

స్థలం విలువ రూ.1.50 కోట్లు

పట్టించుకోని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement