
ఓటమి భయంతోనే టీడీపీ దాడులు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కడప జిల్లా పులివెందులలో ఏ ఎన్నిక నిర్వహించినా గెలుపు వైఎస్సార్ సీపీదేనని, చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసిన గెలవలేడని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని యాదవ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మూకలు రెచ్చిపోతూ ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, రామలింగారెడ్డిపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడిగా ప్రజలకు అండగా నిలబడిన వ్యక్తి రమేష్‌యాదవ్ అని పేర్కొన్నారు. కూటమి పాలకులు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుని దాడులు చేసి భయపెట్టి ఉప ఎన్నికలో గెలవాలనుకోవడం తగదన్నారు. ప్రజా సంక్షేమ పాలన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమన్నారు. చంద్రబాబు, లోకేష్‌లకు ఓటమి భయం పట్టుకుందన్నారు. బూత్ నెంబర్లు, పోలింగ్‌స్టేషన్లు మార్చేసి వారికి అనుకూలంగా చేసినంతా మాత్రాన ప్రజలు ఓట్లు వేస్తారనుకోవడం భ్రమ అని పేర్కొన్నారు. ఇప్పటికై నా కూటమి నేతలు తీరు మార్చుకోక పోతే భవిష్యత్తులో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోందన్నారు. సమావేశంలో యాదవ సంఘ నాయకులు గద్దిబోయిన కృష్ణయాదవ్, రాపాక చిన్నారావు, చిన్ని జోగారావు, నక్క దేవానంద, సీమల తారక్, సెలగల శ్యామ్, మురపాల రామారావు, ఇప్పిలి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ నర్తు రామారావు