
ట్రస్ట్ బోర్డులకు గ్రీన్ సిగ్నల్
అరసవల్లి: జిల్లాలోని ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయం, శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథ స్వామివారి ఆలయాల్లో పాలక మండలి నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు దేవదాయశాఖ ఉన్నతాధికారులు పలు సూచనలు, నిబంధనలను ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. రూ.కోటి నుంచి రూ.5 కోట్లలోపు వార్షికాదాయం ఉన్న శ్రీకూర్మం ఆలయంలో 9 మంది, రూ.5 కోట్లు నుంచి రూ.20 కోట్ల లోపు వార్షికాదాయం ఉన్న అరసవల్లి సూర్యక్షేత్రంలో 12 మంది సభ్యులతో పాలకమండలి సభ్యులను నియమించనున్నారు. అయితే అరసవల్లి ఆలయానికి వంశపారంపర్యంగా ఇప్పిలి జోగిసన్యాసిరావు ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా, శ్రీకూర్మం ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తగా విజయనగరానికి చెందిన గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు ట్రస్టు బోర్డు చైర్మన్‌గా కొనసాగనున్నారు. దీంతో పాలకమండలి సభ్యుల స్థానాలు మాత్రమే భర్తీ కానున్నాయి. గురువారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేయడంతో, ఆసక్తి ఉన్నవారు తమ అర్హతలతో రానున్న 20 రోజుల్లోగా ఆయా ఆలయాల కార్యనిర్వహణాధికారులకు దరఖాస్తులను సమర్పించాలని జిల్లా దేవదాయ శాఖాధికారి ప్రసాద్‌పట్నాయక్ తెలియజేశారు.