
విద్యుత్ షాక్‌తో మహిళ మృతి
సోంపేట: మండలంలోని జింకిభద్ర గ్రామానికి చెందిన కూనే సీతమ్మ (58) శుక్రవారం ఉదయం బెంకిలి సాదుమెట్ట వద్ద విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. సోంపేట పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సీతమ్మ ప్రతిరోజూ ఉదయం సాదు మెట్ట మీద ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం పరిసరాలు శుభ్రం చేసి, స్వామివారికి దీపం పెట్టి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్లేటప్పుడు పూజకు పనికొచ్చే పూలను తీసుకెళ్లి బెంకిలి, జింకిభద్ర గ్రామాల్లో పలువురికి ఇచ్చేది. ప్రతిరోజూ మాదిరిగానే శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో సీతమ్మ సాదు మెట్టకు చేరుకుంది. స్వామివారికి దీపం పెట్టడానికి ముందు పూలు కోయడానికి చెట్టు వద్దకు వెళ్లింది. అయితే అక్కడ విద్యుత్ దీపాలంకరణ కోసం ఏర్పాటు చేసిన చిన్న ఫోల్‌ను పట్టుకోవడంతో కేకలు వేస్తూ కుప్పకూలింది. అక్కడ యోగా నేర్చుకుంటున్నవారు వచ్చి 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చి పరిశీలించి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే విద్యుత్ షాక్‌తోనే మహిళ మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి విద్యుత్ అధికారులు, పోలీసులు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరుగుతుందని సోంపేట ఎస్‌ఐ వి.లోవరాజు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక సామాజిక ఆస్పత్రికి తరలించారు. సీతమ్మకు వివాహ బంధంలో చిన్నపాటి గొడవలు రావడంతో, తన మేనల్లుడి ఇంటి వద్దనే గత 30 సంవత్సరాలుగా ఉంటోంది. అందరికీ చేదోడు, వాదోడుగా ఉండే సీతమ్మ మృతితో బెంకిలి, జింకిభద్ర గ్రామాల్లో విషాద చాయలు అలముకున్నాయి.

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి