
మత్స్యకారులపై కేసులు ఎత్తివేయాలి
అరసవల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద కెమికల్ ఫ్యాక్టరీ వల్ల మత్స్య సంపద నాశనమవుతోందని పోరాటం చేస్తున్న మత్స్యకారులపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని, ఈ కేసులను తక్షణమే ఎత్తివేయాలని జిల్లా మత్స్యకార ఎస్టీ సాధన సమితి అధ్యక్షుడు మైలపల్లి పోలీసు డిమాండ్ చేశారు. నగరంలోని భూపాలరావువీధిలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్స్య సంపదను కాపాడాల్సిన ప్రభుత్వం.. కెమికల్ కార్పొరేట్ శక్తులతో చేతులుకలిపి మత్స్యకారులను బెదిరించడం సరికాదన్నారు. అక్రమ కేసులు బనాయించడాన్ని జిల్లా శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. అక్రమ కేసులు ఎత్తివేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు కార్యచరణ సిద్ధం చేస్తామని హెచ్చరించారు. ఆయనతో పాటు జిల్లా సంఘ ముఖ్య నేతలు ఇద్ది పాపయ్య, గుండాల గణేష్‌కుమార్, కొండా సింహాచలం, మైలపల్లి పోలీస్, సూరాడ లక్ష్మణ, మోసా ఫల్గుణరాజు, మైలపల్లి నర్సింహమూర్తి, మూగి శ్రీరామమూర్తి ఉన్నారు.