తమ్ముళ్లకు కాసుల వాన..
అటు మరమ్మతుల రోడ్లు, ఇటు ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టిన రోడ్లు.. తెలుగు తమ్ముళ్లకు కాసులు కురిపించాయి. దాదాపు రూ.185కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఉపాధి రోడ్లలో ఏ రకంగా నిధులు మింగేశారో జిల్లా ప్రజలందరూ చూస్తున్నారు. బాగున్న రోడ్లపై కొన్ని చోట్ల రోడ్లు వేయగా, మరికొన్నిచోట్ల నాసిరకం రోడ్లు వేసి నిధులు స్వాహా చేశారు. ఇంకొన్నిచోట్ల అయితే ఏకంగా నాయకుల పొలాలకు, ఫాంహౌస్‌లకు, కొబ్బరితోటలకు, రియ ల్ ఎస్టేట్ వెంచర్లకు రోడ్లు వేసుకుని లబ్ధిపొందారు. సొంత అవసరాలకు, స్వప్రయోజనాలకు రోడ్లు వేసుకుని ఉపాధి నిధులను దుర్వినియోగం చేశారు. ఇదే విధంగా మరమ్మతుల కింద ఖర్చు చేసిన రూ.31 కోట్ల రోడ్ల నిధులను సైతం కొల్లగొట్టారు. వర్క్ ఏదైనా సొమ్ము చేసుకోవడమే పనిగా పెట్టుకుని పథకం ప్రకారం దోపిడీకి పాల్పడ్డారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
జిల్లాలో రోడ్డు మరమ్మతులు భలే గమ్మత్తుగా సాగుతున్నాయి. తెలుగు తమ్ముళ్లే కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తడంతో పనుల్లో నాణ్యత గంగలో కలిసిపోయింది. మరమ్మతులే కదా.. పనులు ఎలా చేసినా ఫర్వాలేదనుకుని నాసిరకంగా చేశారు. దీంతో మరమ్మతులు చేసిన కొన్ని రోజులకే మళ్లీ రోడ్లు పాడైపోయి నరకం చూపిస్తున్నాయి. ఉమ్ముతడి పనులతో టీడీపీ కాంట్రాక్టర్ల జేబులు నిండాయే తప్ప రోడ్లు బాగు పడలేదు.
రూ.31కోట్ల పనులపై నాసిరకం ప్రభావం..
జిల్లాలో రూ.31కోట్లతో 938 కిలోమీటర్ల మేర రోడ్లు మరమ్మతులు చేపడుతున్నట్టు యంత్రాంగం ప్రకటించింది. పనులన్నీ దాదాపు పూర్తి చేసినట్టు రిపబ్లిక్ డే రోజున ప్రకటించడం కూడా జరిగింది. అయితే మరమ్మతులు చేసిన రోడ్లను ఒకసారి పరిశీలిస్తే అంతకుముందు.. తర్వాత పరిస్థితులకు ఏ మాత్రం తేడా కనబడటం లేదు. మరమ్మతులు చేపట్టకముందు ఎలా ఉన్నాయో ఇప్పుడలానే దర్శనమిస్తున్నాయి. టీడీపీకి చెందిన కాంట్రాక్టర్లే ఆ పనులు దక్కించకోవడంతో నిధులు గోల్‌మాల్ అయ్యాయి. అడిగే వారు ఉండరని తాము చేసేవే పనులని ఇష్టారీతిన చేపట్టారు. నాసిరకం మెటీరియల్, నాణ్యత లేని పనులు చేసి రోడ్లకు ఎప్పటిలాగే కష్టాలు మిగిల్చారు. మంత్రి అనుచరుడు, ఎమ్మెల్యేల మనుషులే దాదాపు కాంట్రాక్టర్ల అవతారమెత్తి నాసిరకం పనులతో నిధులు స్వాహా చేసేశారు. మరమ్మతుల పనులపై క్వాలిటీ చెక్ ఉండదు, అధికారులు సైతం పెద్దగా పట్టించుకోరని ఇష్టారీతిన కానిచ్చేశారు. ఇంకేముంది ఇప్పుడా రోడ్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. మరోసారి మరమ్మతులు చేయాల్సిన దుస్థితి నెలకొంది.


