555 ఫోన్ల రికవరీ
శ్రీకాకుళం క్రైమ్ : బాధితులు వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్న 555 మొబైల్ ఫోన్లను జిల్లా సైబర్ పోలీసులు ట్రేస్ చేయడమే కాక దొంగలించిన వారి నుంచి రికవరీ చేశారు. సుమారు రూ. 86 లక్షలు విలువైన ఈ ఫోన్లను జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఉదయం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తన చేతుల మీదుగా బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. గత నాలుగున్నరేళ్లుగా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా బాధితులు పోగొట్టుకున్న మొబైళ్లను తమ సైబర్ సెల్, ఐటీకోర్ సిబ్బంది ట్రేస్ చేస్తున్నారని తెలిపారు. అప్పటినుంచి ఇప్పటివరకు బాధితులు 7212 మంది మొబైళ్లు పోగొట్టుకున్నామంటూ ఫిర్యాదు చేయగా 2660 రికవరీ చేసి అందించడం జరిగిందన్నారు. వీటిలో ఈ ఒక్క ఏడాదిలోనే 2442 ఫిర్యాదులు రాగా 1060 రికవరీ చేశామని, మరో 330 ఫోన్లను గుర్తించామన్నారు.
తక్షణ ఫిర్యాదు మేలు..
ఎవరైనా బాధితులు తమ మొబైల్ పోగొట్టుకున్నా.. లేదంటే ఎవరైనా దొంగిలించినా తక్షణమే సీఈఐఆర్ వెబ్ పోర్టల్‌లో ఫిర్యాదు రిజిస్టర్ చేయాలన్నా రు. అందుబాటులో ఉన్న పోలీస్‌స్టేషన్‌ను గానీ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఉన్న సైబర్‌సెల్ బృందాన్ని కలసి ఫిర్యాదు చేయొచ్చన్నారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లో కొత్త వ్యక్తి సిమ్ కార్డు వినియోగించిన వెంటనే ఆ మొబైల్‌ను ట్రేస్ చేయడం వీలవుతుందన్నారు.
సైబర్ సిబ్బందికి ప్రశంసలు..
ఫోన్లలో 60 శాతం ట్రేసిబిలిటీ ఉండగా 80 శాతం రికవరీ ఉండటంలో కృషి చేసిన సైబర్ సెల్ సీఐ టి.శ్రీనివాసరావు బృందం పైలా శరత్‌చక్రవర్తి, జి.శేషగిరిరావు, టి.సుధీర్, పి.సత్యనారాయణ, పద్మజ్యోతి, కుసుమలను ప్రశంసించారు.
బాధితులకు ఎస్పీ చేతుల మీదుగా అందజేత
7212 ఫిర్యాదులకు గాను ఇప్పటివరకు 2660 ఫోన్లు
అందించామన్న ఎస్పీ
555 ఫోన్ల రికవరీ


