రేపటి నుంచి బీచ్ ఫెస్టివల్
శ్రీకాకుళం పాతబస్టాండ్: బారువ బీచ్ వేదికంగా ఈ నెల 3, 4 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అధికారులను ఆదేశించారు. గురువారం అన్ని శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి 70–80 మంది క్రీడాకారులు హాజరుకానున్నారని చెప్పారు. గత వారం జరిగిన ఫెస్టివల్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ఈసారి మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
వర్సిటీకి రెండు నెలలు సెలవులు
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి రెండు నెలలు సెలవులు ప్రకటిస్తూ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. ఈ నెల 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు సెలవులు అమల్లో ఉంటాయని పోస్టు గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ విద్యార్థులకు సెలవులు వర్తిస్తాయని పేర్కొన్నారు.
శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి
ఎచ్చెర్ల క్యాంపస్ : సమస్యాత్మక గ్రామాల్లో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసులపై ఎస్సై వి.సందీప్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అల్లర్లు, ఘర్షణలు, కుట్రలకు పాల్పడే వారు, పాల్పడే అవకాశాలు ఉన్న వారిపై నిఘాపెట్టాలని సూచించారు. మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, శక్తి యాప్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
ఎచ్చెర్ల ఇన్‌చార్జి ఎంపీడీఓ సస్పెన్షన్
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల ఇన్‌చార్జి ఎంపీడీఓ బత్తుల మల్లేశ్వరరావుని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్లేశ్వరరావు 2023–24 ఆర్థిక సంవత్సరంలో టెక్కలి మండల పరిషత్ కార్యాలయంలో ఈవోపీఆర్‌డీగా పనిచేస్తూనే, టెక్కలి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో పంచాయతీ నిధులు దుర్వినియోగంలో పాత్ర ఉందంటూ మల్లేశ్వరరావును సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఎచ్చెర్ల ఈవోపీఆర్‌డీగా పనిచేస్తున్న మల్లేశ్వరరావు మార్చి 10 నుంచి ఇన్‌చార్జి ఎంపీడీవోగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ ఎంపీడీవో సీపాన హరిహరరావు రెండు నెలల దీర్ఘకాలిక సెలవుపెట్టారు.
కర్రసాము పోటీల్లో ప్రతిభ
నరసన్నపేట: ఏలూరులో రాష్ట్ర స్థాయిలో ఏప్రిల్ 30న జరిగిన కర్ర సాము పోటీల్లో నరసన్నపేటలోని కృష్ణా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు సత్తాచాటారు. 38 మంది ప్రథమ స్థానం, 16 మంది ద్వితీయ స్థానం సాధించారు. ఆలిండియా కర్రసాము ఫెడరేషన్ గుర్తింపు పొందిన ఎస్‌వీఆర్‌కే ఇండియన్ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. విజేతలతో పాటు కోచ్ ఆవల చిన్నను పలువురు అభినందించారు.
రేపటి నుంచి బీచ్ ఫెస్టివల్


