మేం చెప్పిన పనులే చేయాలి
అరసవల్లి: గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు గాను కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు 2025– 26 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా జిల్లాకు మొత్తం రూ. 31.76 కోట్లు వరకు నిధులను కేటాయించింది. దీంతో గ్రామ పంచాయతీల్లో స్థానిక సంస్థల పాలక వర్గాలు పనులను గుర్తించి ఆయా పనులను ఆమోదించేలా గ్రామ పంచాయతీల్లో తీర్మానాలను సిద్ధం చేశారు. తీరా చూస్తే ఆ నిధులను వినియోగించే విషయంలో తీవ్రమైన ఆంక్షలను విధించేలా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించడంతో గ్రామ సర్పంచ్‌లు తలలుపట్టుకున్నారు. గ్రామ ప్రణాళిక రిపోర్టు ఆధారంగా జనాభా ఆధా రంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు గాను ఆర్థిక సంఘం నిధులను కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చెలాయించి, తాము గుర్తించిన పనులనే చెయ్యాలి, తాము చెప్పి న విధంగానే చెయ్యాలనేలా షరతులు పెట్టారు. దీంతో రాష్ట్రంతో పాటు స్థానిక జిల్లాలో కూడా అత్యధిక శాతం గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లుగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే ఉండడంతో వీరంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక సంఘ నిధులపై చంద్రగ్రహణం ఎప్పుడు వీడుతుందో అని ఎదురుచూస్తున్నారు.
896 పంచాయతీలకు ఆర్థిక నిధుల సర్దుబాటు
జిల్లాలో 15వ ఆర్థిక సంవత్సర మొదటి విడతగా టైడ్ నిధుల కింద రూ.19,05,60,817, అన్‌టైడ్‌గా రూ.12,70,40,552 నిధులను కేటాయించింది. మొత్తంగా జిల్లాలో 912 గ్రామ పంచాయతీలుండగా.. ఇందులో 896 పంచాయతీలకే ఈ మొత్తం రూ.31,76,01,339 నిధులను సర్దుబాటు చేశారు. సగటున ఒక్కో పంచాయతీకి రూ.6 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు జనాభా ప్రాతిపదికన కేటా యించారు.
నిబంధనల మేరకు 15వ ఆర్థిక సంఘ నిధులు వాడుకోవాల్సి ఉంటుంది. టైడ్ గ్రాంట్‌ను తాగునీరు, పారిశుద్ధ్యానికి, బేసిక్ (అన్‌టైడ్) నిధులను గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ప్రాథమిక అవసరాలైన విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, వేతనాలు తదితర ఖర్చులకు వినియోగించే వెసులుబాటు ఉంది. అయితే నిబంధనలను కాదని, తాము సూచించిన వాటికే ఈ నిధులు ఖర్చు పెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం గత నెల 24న పలు సూచనలను జారీ చేసింది. ఈ సూచనల మేరకు జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు విడుదలైన ఆర్థిక సంఘ నిధులను ఖర్చుచేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై గ్రామ సర్పంచ్‌లు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
ఈ నిధులు వస్తాయనే పలు పంచాయతీల్లో సీసీ రోడ్లను వేయించేసిన గ్రామ సర్పంచులు తాజా నిబంధనల ప్రకారం తమ పనులకు బిల్లులు వచ్చే అవకాశాలు లేవని గ్రహించి ఆందోళన చెందుతున్నారు. మరో మూడు నెలల్లోనే స్థానిక సంస్థల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో తాజా ఆంక్షలు స్థానిక సర్పంచ్‌లకు నిద్ర పట్టకుండా చేస్తున్నా యి. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన క్రమంలో తాజా ఆంక్షలతో బిల్లులు వచ్చే పరిస్థితులు లేవని దీంతో స్థానిక సంస్థల హక్కులను హరిస్తున్నారని గ్రామ సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు.
ఆర్థిక సంఘ నిధుల వినియోగంలో అధికార పార్టీ ఆంక్షలు
సర్పంచ్‌ల పదవీ కాలం ముగియనున్న సమయంలో కుట్ర
జిల్లాకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.31.76 కోట్లు విడుదల
జిల్లాలో 896 పంచాయతీల్లో నిధుల సర్దుబాటు
కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం


