
హార్బర్ పనులు ప్రారంభిస్తారా?
ఎచ్చెర్ల క్యాంపస్: మత్స్యకారుల వలసల నిర్మూలన, జీవన ప్రమాణాల మెరుగు, ప్రాంతీయ అభివృద్ధి లక్ష్యంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బుడగుట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ మంజూరు చేసింది. 2023 ఏప్రిల్ 19న పనులు ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన అప్పటి నుంచి పనులు నిలిచిపోయాయి. ఇదే గ్రామంలో శనివారం రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటిస్తున్నా రు. ఫిషింగ్ హార్బర్ పనుల పూర్తి కోసం కోటి ఆశలు, వేయి కళ్లతో మత్స్యకారులు ఎదురు చూ స్తున్నారు. కొన్నాళ్లు అటవీ శాఖ అభ్యంతరాలు అన్నారు. అటవీ భూములు విడిచి పెట్టి ప్రభుత్వ భూమిలో నిర్మించవచ్చు, అయినా పనులు ముందుకు సాగలేదు. దాదాపుగా 11 నెలల పాటు పనులు నిలిచి పోవటం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది. పనులు కొనసాగితే దాదాపుగా 60 శాతం పనులు పూర్తయ్యేవి.
ఫిషింగ్ హార్బర్‌కు భూమి పూజకు ముందే రూ.366 కోట్లు టెండర్ పూర్తిచేశారు. ఈ టెండర్లను విశ్వ సముద్ర కాంట్రాక్టు సంస్థ దక్కించుకుంది. ప్రస్తుతం బిల్లుల చెల్లింపులు లేక, పనులు మందుకు సాగని పరిస్థితి కొనసాగుతోంది. సర్వే నంబర్ 504–18 లో 42 ఎకరాలు ప్రభుత్వ స్థలం కేటాయించారు. రాతి కట్టడాలు, అంతర్గత రోడ్డు లు, కాంక్రీట్ ఫౌండేషన్ వంటి పనులు ప్రారంభించి అసంపూర్తిగా ప్రస్తుతం విడిచి పెట్టారు.
స్థానిక మత్స్యకారులు ఈ ఫిషింగ్ హార్బర్ కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నారు. ఎచ్చెర్ల, రణస్థలం మండలాల పది గ్రామాల మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రం వీరావల్, సూరత్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు వెలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు. హార్బర్ పూర్తయితే వలసలు నిలిచే అవకాశం ఉంది.