● నేడు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ
బత్తలపల్లి: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని 13 గ్రామ పంచాయతీలకు గాను 99 మంది, 138 వార్డులకు గాను 268 మంది తమ నామినేషన్లు గత మూడు రోజుగా దాఖలు చేశారు. మూడు రోజులపాటు మండలంలోని నామినేషన్ స్వీకరణ కేంద్రాలు పార్టీ నేతలతో కిటకిటలాడాయి. పెద్ద సంఖ్యలో పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి నామినేషన్ కార్యక్రమాన్ని పోలీసు అధికారులు పర్యవేక్షించారు. అత్యధికంగా పోట్లమర్రి పంచాయతీ సర్పంచ్ స్థానానికి 11 నామినేషన్లు రాగా, అత్యల్పంగా అప్పరాచెరువు పంచాయతీకి 4 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా బుధవారం నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నట్టు మంగళవారం ఎంపీడీఓ క్రిష్టప్ప తెలిపారు. కావున అభ్యర్థులు, ప్రతిపాదకులు బుధవారం ఉదయం 8 గంటలకు ఆయా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
ముదిగుబ్బ మండలంలో..
ముదిగుబ్బ: మండల వ్యాప్తంగా ఉన్న 25 పంచాయతీలకు గాను మూడవ రోజు మంగళవారం 88 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లను దాఖలు చేశారు. అదే విధంగా 295 మంది వార్డు మెంబర్లుగా నామినేషన్లను దాఖలు చేశారు. మలకవేమల వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా సుభాషిణి, సంకేపల్లి వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా రవి నామినేషన్లను దాఖలు చేశారు.
సర్పంచ్ స్థానాలకు 138 నామినేషన్లు
ధర్మవరం రూరల్: ధర్మవరం మండలంలో 20 పంచాయతీలు ఉండగా సర్పంచ్ అభ్యర్థులుగా మొత్తం 138 మంది నామినేషన్లను దాఖలు చేశారు. అదే విధంగా 196 వార్డు స్థానాలకు 360 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎంపీడీఓ వెంకటేష్ తెలిపారు. బుధవారం నామినేషన్ల పరిశీలన ఉంటుందని ఆయన వివరించారు.
ముగిసిన సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు
తాడిమర్రి: మండలంలోని నాలుగు నామినేషన్ల కేంద్రాల్లో గత మూడు రోజులుగా జరుగుతున్న సర్పంచ్ నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగిసింది. మండలంలో 14 గ్రామ పంచాయతీలు ఉండగా సర్పంచ్ స్థానాలకు 90 మంది, పంచాయతీల పరిధిలోని వార్డు స్థానాలకు 244 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇందులో అత్యధికంగా ఎం.అగ్రహారం సర్పంచ్ స్థానానికి 13 నామినేషన్లు, అత్యల్పంగా దాడితోట, పెద్దకోట్ల సర్పంచ్ స్థానానికి 4 నామినేషన్లు వచ్చినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
నామినేషన్ల ప్రక్రియ సజావుగా చేపట్టాలి
గాండ్లపెంట: మండల వ్యాప్తంగా 14 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ సజావుగా చేపట్టాలని ఎంపీడీఓ రామక్రిష్ణ స్టేజ్–1 అధికారులకు తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం స్టేజ్ – 1 అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 4 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. మూడు రోజులపాటు జరిగే నామినేషన్ల ప్రక్రియను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఏఓ నరేంద్రారెడ్డి, స్టేజ్–1 అధికారులు ఏఓ సయ్యద్ షాదాబ్, ఎంఈఓ–1,2 క్రిష్ణానాయక్, శ్రీనివాసులు, మండల ఇంజనీరింగ్ అధికారి రెడ్డి వరప్రసాద్, ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కనగానపల్లిలో 500 నామినేషన్లు దాఖలు
కనగానపల్లి: మండలంలో పంచాయతీ ఎన్నికలకు మొత్తం 500 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీఓ అనిల్‌కుమార్ తెలిపారు. ఇందులో 18 సర్పంచ్ స్థానాలకు 144 నామినేషన్లు, 180 వార్డు మెంబర్ల స్థానాలకు 356 నామినేషన్లు వేశారు. కాగా మూడోరోజు మంగళవారం అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో వచ్చి 276 నామినేషన్లు వేశారు. దాదులూరులో అత్యధికంగా 14, కోనాపురంలో అత్యల్పంగా మూడు నామినేషన్లు వేశారు. ముక్తాపురంలో 10 వార్డులకు 10 నామినేషన్లు మాత్రమే రావడంతో అక్కడ 10 వార్డులు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.
చెన్నేకొత్తపల్లిలో 484 నామినేషన్లు
చెన్నేకొత్తపల్లి మండలంలోని 15 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 133, వార్డు మెంబర్ స్థానాలకు 351 మొత్తంగా 484 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మండలంలో మూడో రోజు ఒక్కటే 233 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానానికి కనుముక్కలలో అత్యధికంగా 18 నామినేషన్లు వేశారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ వైఎస్సార్‌సీపీ, టీడీపీ మద్దతుదారులు పోటీలో ఉన్నారు.


