బత్తలపల్లి: నవజాత శిశువుల ఆరోగ్యంపై వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వ్యాధి నిరోధక అధికారి డాక్టర్ చెన్నారెడ్డి సూచించారు. జాతీయ నవజాత శిశువుల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం బత్తలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ అరుణ్‌కుమార్ అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవంబర్ 21వ తేదీ వరకు నిర్వహిస్తున్న వారోత్సవాల లక్ష్యాలను వివరించారు. నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ, వ్యాధుల నివారణ, శిశు మరణాల తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించాలని సూచించారు. తల్లిపాల ప్రాముఖ్యత, శిశువులకు తగిన వెచ్చదనం, పరిశుభ్రత, తక్కువ బరువుతో పుట్టిన పిల్లల సంరక్షణ, సకాలంలో టీకాలు వేయించడం వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి బాలింతలకు అవసరమైన సూచనలు చేయాలని తెలిపారు. శిశువుల్లో అనారోగ్య లక్షణాలను ముందుగానే గుర్తించి తక్షణ వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. తల్లులు వైద్య సిబ్బంది సూచనలు పాటిస్తూ శిశువుల ఆరోగ్యంపై నిరంతరం శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ విష్ణువర్ధన్, సీహెచ్‌ఓ రాజశేఖర్, పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


