ప్రజాస్వామ్యానికి సంకెళ్లా! | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యానికి సంకెళ్లా!

Nov 18 2026 1:44 AM | Updated on Nov 18 2026 1:44 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు. అలాంటి హక్కును వినియోగించుకునేందుకు ముందుకొచ్చిన అభ్యర్థిని నామినేషన్‌ దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారంటూ రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం నసనకోటలో వివాదం నెలకొంది. సర్పంచ్‌ అభ్యర్థి కాంతను నామినేషన్‌ వేయకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పోలీసుల జోక్యం, తనను ఇంటి వద్దే అడ్డుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

నామినేషన్‌ పత్రాలు చించేశారు

మంగళవారం నసనకోటకు వెళ్లేందుకు ప్రయత్నం చేసిన గోరంట్ల మాధవ్‌ను అనంతపురం నగర శివారులోని ఇంటివద్ద పోలీసులు అడ్డుకున్నారు. తమ అభ్యర్థి కాంత ముందు రోజు వాహనంలో వెళ్తుండగా కొందరు అడ్డుకుని బలవంతంగా మరో వాహనంలోకి ఎక్కించుకున్నారని, ఆ సమయంలో నామినేషన్‌ పత్రాలను చించివేశారని గోరంట్ల మాధవ్‌ ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు, అభ్యర్థిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. పోలీసుల జోక్యంతో అభ్యర్థిని విడిపించారని, అయితే అభ్యర్థిని అడ్డుకుని, నామినేషన్‌ పత్రాలను చించివేసిన ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అభ్యర్థితో కలిసి వస్తానన్నా అడ్డంకులా?

చివరి రోజైనా తమ అభ్యర్థి కాంత నామినేషన్‌ దాఖలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గోరంట్ల మాధవ్‌ కోరారు. తానే స్వయంగా అభ్యర్థితో కలిసి వచ్చి నామినేషన్‌ వేయిస్తానని పోలీసు అధికారులతో మాట్లాడారు. ఇందుకు పోలీసులు ససేమిరా అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థిని ఈ విధంగా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలోనే అభ్యర్థికి ఇబ్బందులు ఎదురైతే సామాన్య అభ్యర్థుల పరిస్థితి ఏమిటని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అభ్యర్థితో కలిసి వెళ్లి నామినేషన్‌ వేయించాలన్న ఆయన ప్రయత్నానికి పోలీసులు అనుమతించకపోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా ఎట్టకేలకు మధ్యాహ్నం పైన పోలీసుల పహారాలో కాంత నామినేషన్‌ దాఖలు చేశారు.

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement