రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో ప్రతిభ

Nov 18 2026 1:44 AM | Updated on Nov 18 2026 1:44 AM

ధర్మవరం అర్బన్‌: రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో ధర్మవరం విద్యార్థిని ప్రతిభ చూపారని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సుమన, పీడీ స్వరూప, కోచ్‌ ఇనాయత్‌భాషలు తెలిపారు. పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో ప్రతిభ చూపి సిల్వర్‌ మెడల్‌ సాధించిన విద్యార్థినిని అభినందించారు. ఇటీవల పిఠాపురంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన 70వ ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19 బాక్సింగ్‌ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాఠశాల పదో తరగతి విద్యార్థిని వర్షిణి సిల్వర్‌ మెడల్‌ సాధించిందని తెలిపారు. విద్యార్థిని భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

మద్యం సేవించి

వాహనాలు నడిపితే చర్యలు

పుట్టపర్తి టౌన్‌: మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని పుట్టపర్తి అర్బన్‌ డీఎస్పీ మాణిక్యారావ్‌ తెలిపారు. మంగళవారం పుట్టపర్తి అర్బన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని కర్ణాటకనాగేపల్లి రోడ్డు వద్ద పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేస్తున్న నలుగురిని గుర్తించి కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులను పుట్టపర్తి మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరపరిచారు. విచారించిన న్యాయమూర్తి.. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.40 వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.

ఎన్నికల్లో పోటీ చేసే వారికి రక్షణ కల్పిస్తాం

● ధర్మవరం డీఎస్పీ జగన్నాథరాజు

కనగానపల్లి: ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల్లో పోటీ చేసే వారికి తగిన రక్షణ కల్పిస్తామని ధర్మవరం డీఎస్పీ బీవీ జగన్నాథరాజు తెలిపారు. మంగళవారం స్థానిక కనగానపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ధర్మవరం డివిజన్‌ పరిధిలోని మండలాల్లో మొదటి విడతలో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకొనేందుకు ప్రతిచోటా పటిష్టమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. దీనిద్వారా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు స్వేచ్ఛగా వచ్చి నామినేన్లు వేశారన్నారు.

బైకును ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి

కదిరి అర్బన్‌: మున్సిపల్‌ పరిధిలోని బ్లూమూన్‌ పాఠశాల వద్ద జాతీయ రహదారిపై ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఈశ్వర్‌రెడ్డి (58) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... కదిరి మండలం చిప్పలమడుగు గ్రామానికి చెందిన ఈశ్వర్‌రెడ్డి బ్లూమూన్‌ పాఠశాల వద్ద యర్రదొడ్డి రోడ్డు నుంచి జాతీయ రహదారిపైకి బైకులో వస్తుండగా కదిరి నుంచి అనంతపురం వైపు వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఈశ్వర్‌రెడ్డిని స్థానికులు కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగుళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈశ్వర్‌రెడ్డి మృతితో చిప్పలమడుగు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నేడు కోర్టుకు రాప్తాడు కేసు నిందితుడు?

అనంతపురం సిటీ: రాప్తాడు జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్‌ రంపంతో దాడి చేసిన హేమంత్‌ను బుధవారం ఉదయం అనంతపురం జిల్లా కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. గత నెల 31న దాడికి తెగబడిన హేమంత్‌ ఆత్మకూరు అటవీ ప్రాంతంలో తలదాచుకున్నట్లుగా గుర్తించిన పోలీసులు ఈ నెల 1న రాత్రి అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో పోలీసులపై కత్తితో దాడి చేసి తప్పించుకుని పారిపోతుండగా జరిపిన కాల్పుల్లో హేమంత్‌ రెండు కాళ్లలోనూ బుల్లెట్లు దూసుకెళ్లాయి.అప్పటి నుంచి అనంతపురంలోని జీజీహెచ్‌లో చికిత్స పొందే వాడు. నాలుగు రోజుల క్రితం పల్మనరీ ఎంబాలిజం కారణంగా ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండడంతో న్యాయస్థానం ఆదేశాలతో ఉన్నత వైద్యం కోసం కర్నూలులోని జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం హేమంత్‌ ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో బుధవారం కర్నూలు జీజీహెచ్‌లో డిశ్చార్జ్‌ చేయనున్నట్లు తెలిసింది. అక్కడ డిశ్చార్జ్‌ పొందిన అనంతరం నేరుగా అనంతపురం జిల్లా కోర్టుకు తరలించి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement