హిందూపురం టౌన్: పురంలో న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే తాను అత్యధిక మెజార్టీతో విజయం సాధించేదానినని వైఎస్సార్సీపీ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి షాజియా పేర్కొన్నారు. మంగళవారం ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికార పార్టీ నాయకులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరించారని, కౌంటింగ్ సమయంలో తీవ్ర గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. సమావేశంలో ఒకలా చెప్పి, కౌంటింగ్ వద్ద ఒకలా టేబుళ్లు ఏర్పాటు చేశారన్నారు. ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత మొదట్లో ప్రక్రియ సజావుగానే సాగిందని, అయితే కౌన్సిలర్ ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో ఏ బ్యాలెట్ బాక్సులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తమ ఏజెంట్లు ఏ గదిలో ఉండాలో అర్థంకాని పరిస్థితి కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి విషయంలోనూ ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు జోక్యం చేసుకోవడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. కౌంటింగ్ ప్రక్రియలో ఆద్యంతం తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూపురం ఎన్నికలను అధికారులు కాకుండా ఎమ్మెల్యే పీఏలు నిర్వహించారని షాజియా ఎద్దేవా చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో జరిగిన పరిణామాలపై తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని, తమకు అన్యాయం జరిగిందని వాపోయారు. ఈ ఎన్నికల్లో తన వెంట నిలిచిన వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. నైతికంగా ఎన్నికల్లో తానే విజయం సాధించానని ఆమె తెలియజేశారు.
ఓట్ల లెక్కింపుపై తీవ్ర అభ్యంతరాలు
పురంలో ఎన్నికల అధికారులుగా ఎమ్మెల్యే పీఏలు
నైతిక విజయం వైఎస్సార్సీపీదే
వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థి షాజియా


