పల్లె పాలన పడతి చేతుల్లోకి వెళ్లనుంది. జిల్లాలోని దాదాపు సగం పంచాయతీ పీఠాలపై మహిళలే కొలువుదీరనున్నారు. ఇప్పటికే ఖరారైన రిజర్వేషన్ల మేరకు సర్పంచ్, వార్డు సీట్లలో దాదాపు సగం మహిళలకే కేటాయించారు. జనరల్ స్థానాల్లోనూ పోటీ చేసే అవకాశం ఉండటంతో అధికారం ‘ఆమె’ హస్తగతం కానుంది.
మడకశిర: పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు కాగా, మహిళలకు అధిక సీట్లు కేటాయించారు. దీంతో ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళలు పోటీ చేయడానికి అవకాశం లభించనుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని మహిళలకు అధిక స్థానాలు రిజర్వు కాగా, జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీ చేసే అవకాశం ఉంది.
227 మందికి సర్పంచ్ స్థానాలు..
జిల్లా వ్యాప్తంగా 467 గ్రామ పంచాయతీలుండగా, అందులో మహిళలకు 227 గ్రామ పంచాయతీలు రిజర్వ్ చేశారు. దీంతో ఆయా గ్రామ పంచాయతీల్లో పోటీ చేయడానికి అన్ని వర్గాల మహిళలకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా జిల్లాలో వంద శాతం ఎస్టీ గ్రామ పంచాయతీలు 21 ఉండగా, అందులో ఎస్టీ మహిళలకు 7 పంచాయతీలు రిజర్వ్ చేశారు. నాన్ షెడ్యూల్ ఏరియాలో ఎస్టీలకు 10 పంచాయతీలు రిజర్వ్ చేయగా, అందులో ఎస్టీ మహిళలకు 2 పంచాయతీలను కేటాయించారు. ఎస్సీలకు 71 గ్రామ పంచాయతీలను రిజర్వ్ చేయగా, అందులో 29 పంచాయతీలను ఎస్సీ మహిళలకు కేటాయించారు. బీసీలకు 125 పంచాయతీలను రిజర్వ్ చేయగా, అందులో బీసీ మహిళలకు 60 పంచాయతీలను ఖరారు చేశారు. అన్‌రిజర్వ్‌డ్ కింద 240 గ్రామ పంచాయతీలను ఉంచగా, అందులోనూ 129 పంచాయతీలను మహిళలకు రిజర్వ్ చేయడం గమనార్హం.
వార్డుల్లోనూ వనితలకే అవకాశం..
జిల్లాలోని 467 పంచాయతీల పరిధిలో 4,912 వార్డులుండగా, అందులో మహిళలకు 2,458 వార్డులు కేటాయించారు. వందశాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో 168 వార్డులుండగా... ఎస్టీ మహిళలకు 84 వార్డులు రిజర్వ్ చేశారు. నాన్ షెడ్యూల్ ఏరియాలో 181 వార్డులను ఎస్టీలకు కేటాయించారు. అందులో ఎస్టీ మహిళలకు 62 వార్డులను రిజర్వ్ చేశారు. అలాగే ఎస్సీలకు 756 వార్డులు కేటాయించగా, అందులో 302 వార్డులను ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేశారు. బీసీలకు 1,433 వార్డులు ఖరారు చేయగా, అందులో బీసీ మహిళలకు 680 వార్డులు రిజర్వ్ చేశారు. అన్‌రిజర్వ్‌డ్ కింద 2,374 వార్డులను ఉంచగా, అందులో మహిళలకు 1,330 వార్డులు రిజర్వ్ చేయడం విశేషం.
240 గ్రామ పంచాయతీలు జనరల్..
జిల్లాలోని 240 గ్రామ పంచాయతీలను, 2,454 వార్డులను జనరల్‌కు కేటాయించారు. ఈ స్థానాల్లో అన్ని వర్గాల వారు పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. రిజర్వ్ స్థానాల్లోనే కాకుండా మహిళలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా ఈ స్థానాల్లో పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. పలు ప్రాంతాల్లో జనరల్ స్థానాల్లో కూడా మహిళలు పోటీ చేసే అవకాశం లేకపోలేదు. ఈ లెక్కన పల్లె పాలన పడతి చేతిలో ఉండనుంది.
సతులను పోరులో నిలిపేందుకు ప్లాన్
పలు పంచాయతీలు మహిళలకు రిజర్వ్ అయిన నేపథ్యంలో ఆయా పంచాయతీ సర్పంచ్‌లుగా పోటీ చేయాలని భావించిన నేతలు డైలమాలో పడ్డారు. కొందరు మాత్రం వారి భార్యలను సమాయత్తం చేస్తున్నారు. అంతా తాము చూసుకుంటామని నచ్చజెప్పి పోరులో నిలిపే పనిలో పడ్డారు.
పంచాయతీల్లో పడతికే పట్టం
దాదాపు సగం పంచాయతీలు
మహిళలకు రిజర్వ్
వార్డుల్లోనూ తగు ప్రాధాన్యం
అన్‌రిజర్వ్‌డ్ స్థానాల్లోనూ
129 చోట్ల అవకాశం
బీసీ మహిళలకు 60, ఎస్సీ మహిళలకు 29 సర్పంచు స్థానాలు
9 చోట్ల ఎస్టీ మహిళలకు ఛాన్స్


