సాక్షి, పుట్టపర్తి: ఆరోగ్య శాఖకు అవినీతి జబ్బు సోకింది. జిల్లా కార్యాలయంలో పని చేసే సిబ్బంది ప్రతి పనికీ ఓ రేటు ఫిక్స్ చేసి అక్రమ దందా నడిపిస్తున్నారు. ఫైల్ కదలాలంటే కనీసం పైకం చెల్లించుకోవాల్సిందేనని అధికారులు వాపోతున్నారు.
రూ.10 వేలు ఇస్తేనే రెగ్యులరైజేషన్‌కు!
జిల్లా పరిధిలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యుల ప్రొబేషన్ ముగిసింది. వీరి ఉద్యోగాలు రెగ్యులరైజేషన్ చేసేందుకు ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నుంచి రెండు నెలల క్రితమే ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ కార్యాలయంలోని ఓ అధికారి రెగ్యులరైజేషన్‌కు రేటు ఫిక్స్ చేశారు. ప్రతి ఒక్కరూ రూ.10 వేలు చొప్పున ఇస్తే ప్రక్రియ పూర్తి చేస్తానని తేల్చిచెప్పారు. డబ్బులివ్వని ఫైలు ఇప్పటికీ అతని టేబుల్‌పైనే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సదరు అధికారి దెబ్బకు పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్లు బెంబేలెత్తిపోతున్నారు. సదరు అధికారిపై చర్యలు తీసుకోకుంటే శాఖకు చెడ్డపేరు రావడం ఖాయమని చెబుతున్నారు.
ఆ సీటు.. ఆరంభం నుంచి హాటు
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆరంభం నుంచి అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని స్థానాల్లో అధికారులను మార్చినా.. తీరు మాత్రం మారడం లేదు. ఒకే పేరుతో ఉన్న ఇద్దరిపై గతంలో ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. అప్పట్లో ఒకరిని బదిలీ చేయగా.. మరొకరికి వేరే విధులు అప్పజెప్పారు. అయితే ఆ సీట్లలో వచ్చిన కొత్త వారు మరింత అవినీతికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఓ సీటు.. చాలా హాటుగానే ఉంటోంది. ఆరంభం నుంచి ఆ సీటులోకి ఎవరు వచ్చినా దందాలకు తెరదీస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో మెడికల్ ఆఫీసర్లకు.. సదరు అధికారికి మధ్య వివాదం తలెత్తి వాగ్వాదం జరగడంతో అప్పట్లో చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆ కుర్చీలో వచ్చిన కొత్త అధికారితో కూడా మెడికల్ ఆఫీసర్లకు సమస్య ఉత్పన్నమైంది. అయితే అంతకుముందు పరువు కోసం కొట్లాడితే.. ప్రస్తుతం లంచం ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు మెడికల్ ఆఫీసర్లు జిల్లా అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ఆగని అద్దె కార్ల దందా..
వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో అద్దె కార్ల దందా కొనసాగుతూనే ఉంది. గతంలో పత్రికల్లో కథనాలు ప్రచురితం కాగా, కొన్నిరోజుల పాటు పరిమిత వాహనాలు వినియోగిస్తున్నట్లు నటించారు. తర్వాత యథావిధిగా అద్దె కార్ల దందా కొనసాగుతున్నట్లు తెలిసింది. ఉద్దరకొస్తుందని ఒకే కార్యాలయంలో ఏడు అద్దె కార్లు వినియోగిస్తుండటం మిగతా కార్యాలయాల్లోనూ చర్చకు దారి తీసింది.
తన్నులాట.. కుమ్ములాట..
వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో పని చేసే సిబ్బంది మధ్య సమన్వయం లోపించింది. ఒకరిపై మరొకరు బహిరంగ విమర్శలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలుమార్లు సిబ్బంది మధ్య గొడవలు వెలుగు చూశాయి. వీధి రౌడీల తరహాలో తన్నుకున్నారు. అవన్నీ పక్కన పెడితే ఇటీవల కుటుంబ సమస్యలు సైతం కార్యాలయంలో సంభాషణకు వచ్చినట్లు తెలిసింది. ఒకరి కుటుంబ విషయాలు మరొకరు బహిరంగంగా మాట్లాడటంతో సిబ్బంది మధ్య గొడవలు జరుగుతున్నాయి. అతి హద్దుదాటి పోలీస్ స్టేషన్‌లకు చేరి పంచాయితీలు నడుస్తున్నాయి.
పలకని అధికారులు..
అద్దె కార్ల గురించి.. గొడవల గురించి.. అవినీతి ఆరోపణల గురించి ‘సాక్షి’ ఆరా తీసేందుకు ప్రయత్నించగా...సంబంధిత అధికారులు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు. గొడవలు చేసిన సిబ్బందీ ముఖం చాటేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం కుటుంబ తగాదాల పంచాయితీ పోలీస్ స్టేషన్లలో నడుస్తోంది. జిల్లా కార్యాలయంలో ఏం జరుగుతున్నా.. ఉన్నతాధికారి మాత్రం తనకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
ప్రతి పనికీ రేటు ఫిక్స్ చేసి
అక్రమ దందా
జిల్లా కార్యాలయంలోని
సిబ్బంది చేతివాటం
ఆ అధికారి దెబ్బకు
మెడికల్ ఆఫీసర్ల బెంబేలు
ఫైల్ కదలాలంటే రూ.10 వేలు
చెల్లించాల్సిందే


