హిందూపురం టౌన్: విధి నిర్వహణలో ఉన్న న్యాయవాది వెంకటరెడ్డిపై దాడి చేసిన లేపాక్షి ఎస్ఐ నరేంద్రపై చర్యలు తీసుకోవాలని హిందూపురం న్యాయవాదుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం నాయకులు మాట్లాడుతూ... తన క్లయింట్, చిలమత్తూరు మాజీ ఎంపీపీ పురుషోత్తంరెడ్డిని ఈ నెల 10వ తేదీన పోలీసులు అరెస్టు చేయగా, ఆయనకు బెయిల్ దాఖలు చేసేందుకు అవసరమైన సంతకాల కోసం వెళ్లిన న్యాయవాది వెంకటరెడ్డిపై లేపాక్షి ఎస్ఐ నరేంద్ర దురుసుగా ప్రవర్తించారన్నారు. న్యాయవాది చేతిలో ఉన్న పత్రాలను బలవంతంగా లాక్కోవడమే కాకుండా, ఆయనపై దాడికి ప్రయత్నించడం హేయమైన చర్య అన్నారు. పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తికి బెయిల్ దాఖలు చేయడం తమ వృత్తిపరమైన బాధ్యత అని వివరించారు. అలాంటి విధుల్లో ఉన్న న్యాయవాదులను అడ్డుకోవడం, వారిపై దాడులకు ప్రయత్నించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సమర్థనీయం కాదన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఎస్ఐ నరేంద్రపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణకు, వృత్తిపరమైన స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో న్యాయవాదులు రామచంద్రారెడ్డి, ఇందాద్, వెంకటరెడ్డి, కృష్ణమూర్తి, నాగరాజురెడ్డి, సదాశివరెడ్డి, హిదయతుల్లా ఖాన్, ఆసిఫ్, రకీబ్, అభిజిత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
విధులు బహిష్కరించి
న్యాయవాదుల నిరసన


