మొదలైన ‘చలి’గింతలు | - | Sakshi
Sakshi News home page

మొదలైన ‘చలి’గింతలు

Nov 13 2026 8:21 AM | Updated on Nov 13 2026 8:21 AM

● ఈ ఏడాది చిత్ర విచిత్ర

వాతావరణ పరిస్థితులు

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లాలో ‘చలి’ గింతలు మొదలయ్యాయి. రెండు మూడు రోజులుగా ఉదయం వేళ పొగమంచుతో పాటు చలి వాతావరణం కొనసాగుతోంది. ఈ సారి నవంబర్‌ రెండో వారంలోనే శీతల పరిస్థితులు రావడం విశేషం. గురువారం శెట్టూరులో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కళ్యాణదుర్గం కంబదూరు, కుందుర్పి, బెళుగుప్ప, పుట్లూరు, గుంతకల్లు, నార్పల, ఆత్మకూరు, పామిడి తదితర మండలాల్లో కూడా 17 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు శ్రీసత్యసాయి జిల్లాలో కూడా మడకశిర ప్రాంతంలో 16 నుంచి 17 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా మండలాల్లో 18 నుంచి 22 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. ఇంకా మార్చి వరకు సీజన్‌ కొనసాగే పరిస్థితి ఉండటంతో మున్ముందు చలి ఏ మేర ప్రభావం చూపిస్తుందో తెలియడం లేదు. ఎందుకంటే ఈ ఏడాది జూన్‌ నుంచి వాతావరణ మార్పుల వల్ల వర్షాలు కురవాల్సిన సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలతో సూరీడు సెగలు పుట్టించాడు. ఆగస్టు, సెప్టెంబర్‌తో పాటు అక్టోబర్‌లో కూడా కొద్ది రోజులు 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా మూడు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగినట్లు అంచనా వేశారు. అలాగే జూన్‌, జూలై, ఆగస్టులో 20 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. వర్షాకాలంలో వేసవిగాలులు వీయడంతో వరుణుడు ఏ మాత్రం ప్రభావం చూపని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ ఏడాది సాధారణం కన్నా ఏకంగా 42 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఎల్‌–నినో వల్ల నైరుతితో పాటు ఈశాన్య రుతుపవనాలు బలహీనం కావడంతో తేలికపాటి వర్షాలకే పరిమితమయ్యాయి. తాజాగా ఉదయం పూట చలిగింతలు మొదలైనా మధ్యాహ్న సమయంలో ఎండవేడి కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement