ప్రజాధనం మట్టిపాలు | - | Sakshi
Sakshi News home page

ప్రజాధనం మట్టిపాలు

Nov 13 2026 8:21 AM | Updated on Nov 13 2026 8:21 AM

పుట్టపర్తి అర్బన్‌: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి లేదు.. అంతా అరాచకమే అని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా ప్రజాసమస్యలు విస్మరించి, స్వార్థంతో ఆలోచిస్తున్నారు.. ఇందుకు నిదర్శనం మండలంలోని గువ్వలగుట్టపల్లిలో అవసరం లేని రోడ్డుకు రూ.41 లక్షలు ఖర్చు చేయడమేనని తెలుస్తోంది. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడి లబ్ధి కోసమే రోడ్డు వేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.

పుట్టపర్తి మండలంలోని గువ్వలగుట్టపల్లి గ్రామం జాతీయ రహదారికి ఒకటిన్నర కిలోమీటరు దూరం ఉంది. గ్రామంలో 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామానికి వెళ్లేందుకు తారు రోడ్డు చాలా ఏళ్ల క్రితం నిర్మించినా చెక్కుచెదరలేదు. కనీసం గుంతలు కూడా పడలేదు. అయితే రోడ్డు పక్కనే ఉన్న టీడీపీ నాయకులు దాన్ని కలుపునే స్వార్థంతో అక్కరలేకున్నా రోడ్డు వేస్తున్నారు. ఈ విషయంపై అధికారులను ఎందుకు కొత్తగా రోడ్డు వేస్తున్నారని అడిగితే అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు నిర్మించాలని వంద మంది సంతకాలు చేయించారని ఏఈ రాజశేఖర్‌ బుకాయించారు. గ్రామస్తులను అడిగితే అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగలేదని , నాయకుడి లబ్ధి కోసమే రోడ్డు వేస్తున్నారని పేర్కొన్నారు.

నాణ్యతకు తిలోదకాలు..

గ్రామానికి రోడ్డు వేసే 100 మీటర్లు పొడవైన రోడ్డు నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. పనులు అప్పగించిన తర్వాత ఒక్క సారి కూడా రోడ్డు వైపు అధికారులు కన్నెత్తి చూడలేదని గ్రామస్తులు చెప్తున్నారు. రోడ్డు ఎత్తు చేసేందుకు జాతీయ రహదారి– 342 నుంచి వచ్చిన వ్యర్థాలను తోలించారు. ఇప్పటి వరకు సుమారు 4 అడుగులు ఎత్తు చేసిన రోడ్డుకు ఒక్క సారి కూడా రోలర్‌ వేయలేదు. నీరు పెట్టలేదు. దీంతో ఈ రోడ్డు ఎన్నాళ్లు ఉంటుందని అంతా నాణ్యత లేకుండా చేస్తున్నారని వాపోతున్నారు. గ్రామంలోకి వెళ్లే సమయంలో ఒక్క మలుపు ఉంది. దీన్ని లేకుండా చేయాలని రోడ్డు వేస్తూ మరింత పెద్దగా మలుపు ఉండేలా రోడ్డును నిర్మిస్తున్నారు. పక్కనే ఉన్న డీసీ ల్యాండ్‌, గుట్టలో రోడ్డు వేస్తూ పాత రోడ్డును ఆక్రమించుకునే పన్నాగం పన్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. వృక్షాలు ఉండగా, వాటిని తొలగించారు. టీడీపీకి చెందిన కాంట్రాక్టర్‌, ఏఈ కుమ్మకై ్క పనులు చేస్తున్నారని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు.

రోడ్డు నిర్మించిన తర్వాత చూడండి

కాంట్రాక్టర్‌ కేవలం టీడీపీ నాయకుడు అని పేర్లు పెట్టవద్దు. రోడ్డు నాణ్యతగా ఉంటుంది. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంక ఎందుకు నీళ్లు పెట్టాలి..? మట్టి చదును చేసిన తర్వాత పూర్తిగా గట్టిపడుతుంది. రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత రోలర్‌ వేయిస్తాం. రోడ్డు నిర్మించిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో...

– రాజశేఖర్‌, పీఐయూ ఏఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement