పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి పంచాయతీ పరిధిలోని శాసనకోట రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ (29) మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ మహిపాల్ తెలిపిన మేరకు.. మండలంలోని బీచిగానిపల్లి పంచాయతీ పరిధి గొల్లపల్లికి చెందిన అంజినప్ప కుమారుడు భరత్ నేత కార్మికుడిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత బుధవారం తన బంధువుల శుభకార్యంలో పాల్గొనేందుకు కిరికెరకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై తన మామను పెద్దిరెడ్డిపల్లిలో దింపి వెళ్తున్నాడు. రాత్రి వేళలో శాసనకోట రోడ్డులో ఓ మలుపు వద్ద వెళ్లగానే బైక్ కల్వర్టును ఢీకొట్టింది. బైకుతో పాటు భరత్ రోడ్డు పక్కననున్న కాలువలో పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య అనూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గా మృతుడికి ఇద్దరు సంతానం. ఇందులో రెండు నెలల పాప ఉన్నట్లు తెలిసింది.
వివాహిత ఆత్మహత్య
అమడగూరు: మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన నరసింహులు, లక్ష్మిదేవమ్మ కుమార్తె పుష్ప (28) ఇంట్లో ఉరేసుకొని గురువారం ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు.. పుష్ప తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో పుష్ప ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది. ఇంటికి తిరిగి వచ్చి చూడగా కుమార్తె ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతున్న విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ గోపాల్‌కృష్ణ, సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, మృతురాలు పుష్ప భర్త కూడా ఏడాదిన్నర క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు.
విద్యార్థిని మృతి కేసులో నిందితుడి అరెస్టు
పెనుకొండ రూరల్: పెళ్లి పేరుతో వేధిస్తూ, బెదిరింపులకు దిగి విద్యార్థి మృతికి కారణమైన నిందితుడుని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు.. పట్టణానికి చెందిన ఓ విద్యార్థి ఈ నెల 9న వేధింపులు తాళ లేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడు బోయ అశ్వర్థను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.
మిగులు సీట్లకు 14న స్పాట్ అడ్మిషన్లు
మడకశిరరూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని మడకశిర వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో మిగులు సీట్లకు ఈనెల 14న స్పాట్ కౌన్సెలింగ్ ఉంటుందని కళాశాల అసోసియేట్ డీన్ ఏడుకొండలు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరులోని లాంఫార్మ్‌లో కౌన్సెలింగ్ ఉంటుందని, ఎంసెట్‌లో ఉత్తీర్ణత సాధించిన బైపీసీ, ఎంపీసీ విద్యార్థులు అర్హులన్నారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.


