అరాచకం రాజ్యమేలింది. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. కూటమి దాష్టీకాలు పతాకస్థాయికి చేరాయి. ఎన్నికలు అపహాస్యమయ్యాయి. హామీలు నెరవేర్చి..ప్రజల హృదయాలు గెలుచుకోవడం చేతగాని పాలకులు కుటిల నీతితో వ్యవహరించారు. ఎన్నికల యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని దాడులు, దౌర్జన్యాలు, ఓట్ల రిగ్గింగ్‌ను ప్రోత్సహించారు. మున్సి‘పోల్స్’లో ఓటర్ల
తీర్పునకు విలువ లేకుండా చేశారు.
ఆదివారం జరిగిన మునిసిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అనంతపురం నగర పాలక సంస్థతో పాటు తాడిపత్రి, కళ్యాణదుర్గం తదితర ప్రాంతాల్లో అధికార పార్టీ దాష్టీకాలు చూసి ప్రజలు భీతిల్లిపోయారు.
అనంతపురం: ఓటమి భయం వెన్నులో వణుకు పుట్టిస్తుండడంతో అధికార కూటమి పార్టీలు అనంతపురం నగర పాలక సంస్థ ఎన్నికల్లో అరాచకానికి తెరలేపాయి. పోలింగ్ కేంద్రాలను టీడీపీ, బీజేపీ గూండాలు రాజకీయ క్రీడా మైదానాలుగా, అక్రమాల అడ్డాగా మార్చేశారు.
● 30వ డివిజన్‌లోని 30/3 పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరిగింది. హమాలీ కాలనీలోని బీఆర్ అంబేడ్కర్ నగర పాలక యూపీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్దకు వైఎస్సార్ కడపకు చెందిన చిన్నా అనే వ్యక్తి, బీజేపీ అభ్యర్థి అశోక్‌రెడ్డికి పోలింగ్ ఏజెంట్ ఉన్న ఆదిశేషు పోలింగ్‌బూత్‌లోకి చొచ్చుకెళ్లి.. సిబ్బందిని, ఏజెంట్లను బయటకు పంపి.. తలుపులు మూసివేసి బ్యాలెటర్ పేపర్లను తీసుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.
● 31వ డివిజన్‌లో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొమ్మినేని శివ యల్లనూరు మండలం నుంచి భారీగా మహిళలను రప్పించి దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు కార్పొరేటర్ అభ్యర్థి నాగార్జునరెడ్డి గుర్తించి అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అదే సమయంలో బీజేపీ మేయర్ అభ్యర్థి అజేష్‌బాబు అక్కడకు చేరుకుని ఘర్షణలకు ఆజ్యం పోశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మేయర్ అభ్యర్థి రమేష్‌గౌడ్, తదితరులు అక్కడకు చేరుకోగా.. పోలీసులు అత్యుత్సాహంతో వారిని అక్కడి నుంచి తోసేసి.. రిగ్గింగ్‌కు అవకాశం కల్పించారు. ఇదే డివిజన్‌లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తన అనుచరులను లోపలికి పంపించి రిగ్గింగ్‌కు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు అడ్డుకుని..తిరగబడ్డారు. దీంతో ఎమ్మెల్యే వెనుదిరగాల్సి వచ్చింది.
ఏజెంట్, అభ్యర్థులు, నాయకులపై దాడులు
నగరంలోని 40వ డివిజన్ గుడ్ చిల్డ్రన్స్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలు అనంతపురం రూరల్, ఆత్మకూరు, రాప్తాడు, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాలకు చెందిన వారిని రప్పించి రిగ్గింగ్‌కు యత్నించడంతో పాటు వైఎస్సార్‌సీపీ ఏజెంట్ లోకనాథ్‌పై దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత అక్కడికి చేరుకుని పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ జరిగిన తోపులాటలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి చేతికి గాయమైంది. అలాగే 45వ డివిజన్ జ్ఞాన సరస్వతి స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ శ్రేణుల దౌర్జన్యాన్ని అడ్డుకోబోయిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి అనిల్‌కుమార్‌రెడ్డి, ఆయన సోదరుడు విశ్వనాథరెడ్డి, తండ్రి రామాంజనేయులరెడ్డిపై మద్యం మత్తులో ఉన్న టీడీపీ శ్రేణులు విచక్షణారహితంగా దాడి చేశారు. 39వ డివిజన్ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి సాకే చంద్రశేఖర్ ఇంటిపై మాజీ డిప్యూటీ మేయర్ గంపన్న వర్గీయులు ఇటుకలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు.
బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లే యత్నం
కోర్టు రోడ్డులోని శ్రీ చైతన్య స్కూల్‌లోని పోలింగ్ బూత్ నుంచి బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లేందుకు టీడీపీ అల్లరి మూకలు ప్రయత్నించాయి. ఇంతలో స్పెషల్ పార్టీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 1, 23, 30, 61 డివిజన్లలోనూ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసి.. రిగ్గింగ్‌కు పాల్పడ్డారని అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. 30వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్, కార్పొరేటర్ అభ్యర్థి వెన్నం శివారెడ్డి నిరసనకు దిగగా.. పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
స్థానికేతరులతో సైక్లింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నేతలు ఇతర ప్రాంతాలకు చెందిన వారిని రప్పించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. 48వ డివిజన్‌లో టీడీపీ శ్రేణులు దొంగ ఓట్లు వేస్తుండటాన్ని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి చింతకుంట మధు గమనించి అడ్డుకున్నారు. ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు ‘మా ప్రభుత్వంలో మేము దొంగ ఓట్లు వేయించుకోకూడదా?’ అంటూ దాడికి దిగారు.
దొంగ ఓట్లను ‘దండు’కున్నారు..
41వ డివిజన్‌లో టీడీపీకి చెందిన ‘చంద్ర దండు’ ప్రకాష్‌నాయుడు దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారు. అనంతపురం రూరల్ మండలం పాపంపేట, పిల్లిగుండ్లకాలనీతో పాటు ఆత్మకూరు మండలం నుంచి పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను రప్పించి ఓట్లు సైక్లింగ్ చేయించారు. అక్రమాలను వైఎస్సార్‌సీపీ, స్వతంత్ర అభ్యర్థులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థిపై ప్రకాష్‌నాయుడు దాడికి యత్నించాడు.
గంగారాం.. వీరంగం..
40వ డివిజన్‌లో టీడీపీ నాయకుడు గంగారాం వీరంగం సృష్టించాడు. పోలింగ్ బూత్‌లను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారని, టీడీపీ కార్యకర్తలు లోపలికి వెళ్లి దొంగ ఓట్లు వేశారని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శించారు. ఈ అక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ ఏజెంట్ గవ్వల లోకనాథ్‌పై ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరులు దాడి చేశారు.
తాడిపత్రిలో యథేచ్ఛగా రిగ్గింగ్
తాడిపత్రిటౌన్: పోలీసుల సహకారం.. అధికార టీడీపీ నేతల అరాచకం నడుమ తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో రిగ్గింగ్ యథేచ్ఛగా జరిగింది. ఉదయం ఏడు గంటలకే పట్టణ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న 5వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఓటేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకుడు హాజీపై పోలీసుల ఎదుటే నడి రోడ్డుపై ‘పచ్చ’ మూకలు దాడి చేసి గాయపరిచాయి. పోలింగ్ కేంద్రాల బయట మకాం వేసి.. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు, సానుభూతిపరులను పోలింగ్ కేంద్రాల దరిదాపులకు రాకుండా కట్టడి చేశారు. 48 మున్సిపల్ వార్డులకు గాను రెండు, మూడు వార్డులు మినహా మిగిలిన ఏ వార్డులోనూ వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లు కూర్చోలేకపోయారు.


