పుట్టపర్తి: పుట్టపర్తి మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి టీడీపీ నేతలు బ్యాలెట్ పేపర్లను కలర్ జిరాక్సులు తీయించి ఒక్కో పోలింగ్ బూత్‌లో 100 నుంచి 200 వరకూ దొంగ ఓట్లు వేయించారని మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పుట్టపర్తి పక్కనే ఉన్న బుక్కపట్నం, కొత్తచెరువు మండల కేంద్రాల్లో ఉన్న జిరాక్స్, స్కానింగ్ సెంటర్లలో బ్యాలెట్ పత్రం (సీరియల్ నంబర్ 0007441)ను కలర్ జిరాక్సులు తీయించారన్నారు. బుక్కపట్నంలోని పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న కలర్ జిరాక్సు సెంటర్ ద్వారా తీసిన పత్రాలతో 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గెలుపు కోసం దొంగ ఓట్లు వేసి హైటెక్ దొంగలుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి వార్డులోనూ ఇదే విధంగా దొంగ ఓట్లు వేశారన్నారు. దీనిపై వెంటనే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు, డీజీపీకి, జిల్లా ఎన్నికల అధికారికి , స్థానిక రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఓడిపోతామనే ఇలా దొంగ ఓట్ల సంస్కృతికి పాల్పడినట్లు మండిపడ్డారు. బుక్కపట్నం నుంచి పుట్టపర్తికి వచ్చిన ఓ టీడీపీ నాయకుడే దీనికి కారణమన్నారు. విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయం తెలియగానే పోలీసులు పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల్లోని జిరాక్సు, స్కానింగ్ సెంటర్లను మూసివేయించారని పేర్కొన్నారు. కూటమి నేతలు చిత్తు చిత్తుగా ఓడిపోతున్నారని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. ఇదే విధానాన్ని వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం కొనసాగిస్తారని తస్మాత్ జాగ్రత్త అంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులకు, సంబంధిత అధికారులకు సూచించారు. కలర్ జిరాక్సు బ్యాలెట్ పేపర్ల తతంగం సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి కనుసన్నల్లోనే జరిగిందన్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే ఆందోళనలకు సిద్ధమవుతామన్నారు.
ఓడిపోతామని తెలిసే
టీడీపీ నేతలు బరి తెగించారు
చర్యలు తీసుకోకపోతే
ఆందోళనలు చేస్తాం
పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి


