సాక్షి, పుట్టపర్తి/పెనుకొండ రూరల్/ధర్మవరం/మడకశిర/కదిరిటౌన్: చెదురు మదురు ఘటనల మధ్య మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జిల్లాలోని పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, పెనుకొండ, మడకశిర, హిందూపురం మున్సిపాలిటీల్లో ఆదివారం పోలింగ్ జరిగింది. ధర్మవరంలో బీజేపీ, జనసేన పార్టీ నేతలు రాళ్లు రువ్వుకున్నారు. అధికార పార్టీ నేతలు మడకశిరలో పోలింగ్ కేంద్రాలను ఆక్రమించి రిగ్గింగ్‌కు యత్నించారు.
ధర్మవరంలో రాళ్లు రువ్వుకున్న కూటమి నేతలు
ధర్మవరం పట్టణంలోని 11వ వార్డులోని ఎన్నికల కేంద్రం వద్ద బీజేపీ, జనసేన నాయకులు బాహాబాహీకి దిగారు. జనసేన కౌన్సిలర్ అభ్యర్థి అడ్డగిరి శ్యాం, బీజేపీ అభ్యర్థి జూటూరు వెంకటేశ్ వర్గీయులు ఎవరికి వారు పోలింగ్ కేంద్రంలో తమ ఆధిపత్యం కోసం యత్నించారు. అయితే వారి మధ్య వాగ్వివాదం ముదరడంతో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి.
పోలింగ్ కేంద్రాల ఆక్రమణకు యత్నం
మడకశిర నగర పంచాయతీ ఎన్నికల్లో కూటమి నాయకులు హల్‌చల్ చేశారు. 9, 17, 18, 19, వార్డుపోలింగ్ కేంద్రాలను ఆక్రమించుకొని రిగ్గింగ్ చేసేందుకు కూటమి నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసేందుకు మనుషులను రప్పించారు. అయితే వైఎస్సార్‌సీపీ నాయకులు వారికి అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నారు.
కూటమి ఎమ్మెల్యేలకు జీ హుజూర్
ఎన్నికల నిబంధనల్లో భాగంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పుట్టపర్తిలో బందోబస్తులో పాల్గొన్న సీఐ (ఆర్మ్‌డ్ రిజర్వు) డీ.మహేశ్ అత్యుత్సాహం ప్రదర్శించారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి వచ్చిన సమయంలో ఆమెతో పాటు పదుల సంఖ్యలో అనుమతించారు. అదే సమయంలో అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చెదరగొట్టారు.
పెనుకొండలో రిగ్గింగ్‌కు యత్నం
మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు ప్రతిఘటించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. 4వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భాస్కర్ యాదవ్ వివరాలమేరకు.. జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 4–1లోకి సాయంత్రం 4:20 గంటల ప్రాంతంలో ఐదుగురు టీడీపీ వర్గీయులు చొరబడ్డారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్ తయ్యూబ్‌ను బలవంతంగా బయటకు పంపి రిగ్గింగ్ చేసుకునేందుకు యత్నించారు. అతను ప్రతిఘటించడంతో పెనుగులాట జరిగింది. అభ్యర్థి పోలీసులను ఆశ్రయించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ మూకలను పంపివేశారు.
కదిరిలో వైఎస్సార్‌సీపీ నాయకుల హౌస్ అరెస్ట్
ఓటమి భయంతో కదిరి పట్టణంలోని వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ ప్రణీత్‌రెడ్డి, ఆయన తండ్రి రమేష్‌రెడ్డిలను హౌస్ అరెస్టు చేశారు.
ధర్మవరంలో రాళ్లు రువ్వుకున్న కూటమి నేతలు
మడకశిరలో రిగ్గింగ్‌కు ప్రయత్నాలు
అధికార పక్షానికి కొమ్ము కాసిన పోలీసు వ్యవస్థ
పుట్టపర్తి పోలింగ్ కేంద్రాల్లో సీఐ మహేశ్ ఓవరాక్షన్
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే టార్గెట్ బెదిరింపులు
‘పురం’లో టీడీపీ నేతల ప్రలోభాలు
హిందూపురం టౌన్: పట్టణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ పలు వార్డుల్లో టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. మున్సిపాలిటీలోని 52 వార్డుల్లో 156 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీకి ఓటు వేయాలంటూ ఓటర్లను ప్రలోభపెట్టారు. టీడీపీ అభ్యర్థులకు, నేతలకు పోలీసులు వత్తాసు పలుకుతూ వ్యవహరించడం గమనార్హం. వైఎస్సార్‌సీపీకి సంబంధించిన అభ్యర్థులను, నేతలను పలు చోట్ల భయభ్రాంతులకు గురి చేశారు. పట్టణంలోని శ్రీకంఠపురంలో 14వ వార్డు పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నాయకులు ఎక్కువ మంది చేరడంతో రిగ్గింగ్ జరుగుతుందన్న అనుమానంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి, నేతలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని టీడీపీ వారిని పంపించివేశారు. ముద్దిరెడ్డిపల్లిలో 48వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ చైర్మన్ అభ్యర్థి మంజునాథ్, నాయకులు దురుసుగా ప్రవర్తించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకుని వైఎస్సార్‌సీపీ నేతలను వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించడం గమనార్హం. విషయం తెలుసుకున్న సాక్షి విలేకరులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వద్దకు వెళ్లగా, ఫోటోలు తొలగిస్తేనే వదులుతామని నిర్బంధించే ప్రయత్నం చేశారు. న్యాయవాది వెంకటరెడ్డి అక్కడికి రావడంతో పోలీసులు విలేకరులను వదిలిపెట్టారు.


