న్యూస్‌రీల్
పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డులో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. సామాన్యుడిలా క్యూ లైన్‌లో నిలబడి ఆయన ఓటేశారు. అనంతరం 4, 5, 6 వార్డుల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి పౌరుడు బాధ్యతగా భావించి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
ఎన్నికలకు సహకరించిన
అందరికీ కృతజ్ఞతలు
● కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్
ప్రశాంతి నిలయం: జిల్లాలోని 6 మున్సిపాలిటీల పరిధిలోని 218 వార్డులకు నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన అందరికీ కలెక్టర్ శ్యాంప్రసాద్ కృజ్ఞతలు తెలిపారు. ఆదివారం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన అనంతరం కలెక్టరేట్‌లో ఎస్పీ సతీష్‌కుమార్‌తో కలసి కలెక్టర్ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 72.53 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధులు, కంట్రోల్ రూమ్ సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది, ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలకు జిల్లా యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ నవంబర్ 3న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కూడా ఇదే రీతిలో విజయవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.


