కూటమిలో సర్దు‘పోట్లు’ | - | Sakshi
Sakshi News home page

కూటమిలో సర్దు‘పోట్లు’

Oct 27 2026 12:56 AM | Updated on Oct 27 2026 12:56 AM

● మూడు పార్టీల్లో తెగని సీట్ల పంపకాలు

● ప్రచారంలో తిరగబడుతున్న మిత్రపక్షాలు

● జిల్లా వ్యాప్తంగా బయటపడుతున్న విభేదాలు

● మూడు కండువాలతో తిరగలేక నేతల అవస్థలు

● జనసేనను ఆదరించని టీడీపీ, బీజేపీ నాయకులు

● టీడీపీ టార్గెట్‌గా బీజేపీ, జనసేన విమర్శల పర్వం

సాక్షి, పుట్టపర్తి

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడంతో కూటమి నాయకుల మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. మున్సిపాలిటీలు, మండలాల వారీగా తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ టీడీపీ నేతలపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. మరోవైపు తమను సంప్రదించకుండానే.. జనసేనకు స్థానాలు కేటాయించారని ‘తెలుగు తమ్ముళ్లు’ అసమ్మతి రాగం అందుకున్నారు. దీంతో ప్రచారంలో విభేదాలు తలెత్తుతున్నాయి. మూడు కండువాలు వేసుకుని ప్రచారంలోకి వెళ్లాలని పార్టీ అధ్యక్షులు సూచిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఎవరికి వారుగా ముందుకెళ్తున్నారు. అయితే ప్రచారంలోనూ ఆధిపత్యపోరు అధికం కావడంతో అమాత్యులకూ అవమానం తప్పడం లేదు. తాజాగా మంత్రి సవితపై జనసేన కార్యకర్తలు తిరగబడిన ఘటన కూటమి పార్టీల్లో అంతర్గతపోరును బట్టబయలు చేసింది. ఇలాంటి పరిస్థితులు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి.

చంద్రబాబు ప్రభుత్వంపై భారీ వ్యతిరేకత ఉన్న క్రమంలో జనసేన, బీజేపీ నేతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వేరుగా వెళ్దామంటే కూటమి పొత్తు అడ్డువస్తోంది. కలిసిపోదామంటే ఓటమి ఎదురొస్తోందని బీజేపీ, జనసేన నాయకులు బహిరంగంగానే వాపోతున్నారు. అందువల్లే ప్రస్తుతం మున్సిపల్‌ వార్డుల్లో ఎవరికి వారుగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, జనసేనకు ఇచ్చిన స్థానాల్లోని టీడీపీ నేతలు వారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. పొరపాటున వారు గెలిస్తే రానున్న రోజుల్లో తమకు అవకాశం లేకుండా చేస్తారని భావిస్తున్న ‘తమ్ముళ్లు’ పొత్తుధర్మం మరచి జనసేన, బీజేపీ నేతలను ఓడించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు జనసేన కార్యకర్తలు కూడా టీడీపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.

జిల్లా కేంద్రం పుట్టపర్తిలోనూ మూడు పార్టీల నాయకుల మధ్య సఖ్యత కొరవడింది. మున్సిపాలిటీ పరిధిలో మూడు జెండాలు మోసుకు తిరుగుతున్నా.. గ్రామాల్లో ఐకమత్యం కనిపించడం లేదు. మూడు కండువాలు.. తలో దారిలో వెళ్తున్నాయి. మున్సిపల్‌ వార్డుల్లో ఎవరికి వారుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పుట్టపర్తి రూరల్‌ నుంచి జనసేన తరఫున జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచానని చెబుతూ చిలకం మధుసూదన్‌రెడ్డి తన అనుచరులతో జనాల్లోకి వెళ్తున్నారు. ఒక్క కండువా మాత్రమే కనిపిస్తోంది. పుట్టపర్తి రూరల్‌ సీటును జనసేనకు కేటాయించడం ‘తమ్ముళ్ల’కు రుచించలేదు. దీంతో చిలకం వెంట నడిచేందుకు ఎవరూ ముందుకురావడం లేదు.

పెనుకొండలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రి సవితపై జనసేన కార్యకర్తలు తిరగబడ్డారు. కూటమి ధర్మం పాటించరా? అంటూ ప్రశ్నించారు. మరో మంత్రి సత్యకుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరంలోనూ ‘తెలుగు తమ్ముళ్ల’ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. మిత్రపక్షాలను ఇరకాటంలో పెట్టడమే కమలనాథుల పనిగా మారింది. ఇందులో భాగంగానే తాడిమర్రి, ముదిగుబ్బ సీట్లు జనరల్‌ అయినప్పటికీ పరిటాల శ్రీరామ్‌ పోటీ చేసేందుకు మంత్రి వర్గీయులు అంగీకరించలేదని తెలిసింది. అందువల్లే పరిటాల శ్రీరామ్‌ కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు నుంచి జెడ్పీటీసీగా నామినేషన్‌ దాఖలు చేశారని తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి కాపురం కలగాపులగంగా మారింది.

రాష్ట్రస్థాయి నేతలంతా ఆలింగనాలతో ఐక్యత చాటుతుండగా...స్థానిక నేతలు మాత్రం సమరానికి సై అంటూ కత్తులు నూరుతున్నారు. సర్దుకుపోదాంలే అనుకున్న నేతలు కూడా ఇప్పుడు మూడు పార్టీల జెండాలు వేసుకుని ప్రచారం చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల

టీడీపీ, బీజేపీ నేతలు జనసేనను టార్గెట్‌ చేయగా... మరికొన్ని ప్రాంతాల్లో బీజేపీ, జనసేన నేతలు ‘పచ్చ’నాయకులతో

పోటీకి సిద్ధమయ్యారు.

సీట్లు తేలక...

పోటాపోటీగా

నామినేషన్లు

పుట్టపర్తిలోనూ అదే తీరు..

ఏ మున్సిపాలిటీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే దానిపై కూటమిలో ఇప్పటికీ స్పష్టత లేదు. దీంతో ఎవరికి వారుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంటీపీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ఎవరికి వారుగా నామినేషన్లు దాఖలు చేయడంతో పాటు ప్రచారంలోనూ మూడు పార్టీల అభ్యర్థులు వేర్వేరుగా వెళ్తున్నారు. ‘పరిషత్‌’ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఒక్కరోజే ఉండటంతో జిల్లా స్థాయి నాయకుల ఎదుట పంచాయితీ పెట్టినట్లు తెలిసింది. గంటల వ్యవధిలోనే నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. అయితే మూడు పార్టీల మధ్య సఖ్యత కొరవడటంతోనే సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు తెలిసింది. ఎవరికి వారుగా ఎన్నికలకు వెళ్తే ఓటమి ఖాయమని, అందువల్ల కలిసే ఉండాలని పార్టీ పెద్దలు సూచిస్తున్నారు.

మంత్రి ఇలాకాల్లోనూ మారని తీరు..

ఓటమి భయంతోనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement