● సిబ్బందిని హెచ్చరించిన కలెక్టర్, ఎస్పీ
● హిందూపురంలోని కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలన
హిందూపురం టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని, విధుల్లో నిర్లక్ష్యాన్ని ఏ మాత్రమూ సహించబోమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. సోమవారం వారు స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి రోజువారీ కార్యకలాపాలు, నమోదు ప్రక్రియ, ముందస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే ఎంజీఎం పాఠశాలను సందర్శించి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలులో భద్రతా ప్రమాణాలు, వసతులను తనిఖీ చేశారు. అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో మున్సిపల్ ఎన్నికల కోసం సిద్ధం చేసిన కౌంటింగ్ హాలు, స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి లోటుపాట్లు, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని, భద్రత పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పోలింగ్, కౌంటింగ్ రోజున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. వారి వెంట పెనుకొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, డీఎస్పీ రవిబాబు ఉన్నారు.


