స్థానిక ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

Oct 27 2026 12:56 AM | Updated on Oct 27 2026 12:56 AM

ప్రశాంతి నిలయం: స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు అరుణ్‌ బాబు, కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ తెలిపారు. సోమవారం వారు ఎస్పీ సతీష్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌తో కలిసి కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో ఎన్నికల నిర్వహణ, నామినేషన్లు, పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బంది కేటాయింపు, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, ప్రత్యేక పరిశీలకులు అరుణ్‌బాబు మాట్లాడుతూ, జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలోని 218 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

మున్సిపల్‌ ఓటర్లు 3,85,168 మంది

నవంబర్‌ 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ఉంటుందన్నారు. అవసరమైన ప్రాంతాల్లో నవంబర్‌ 2వ తేదీన రీ–పోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. నవంబర్‌ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 218 వార్డులుండగా 3,85,168 మంది ఓటర్లుగా ఉన్నారన్నారు. ఇందులో పురుషులు 1,89,303 మంది కాగా, సీ్త్రలు 1,95,825 మంది, ఇతరులు 40 మంది ఉన్నారన్నారు. మొత్తంగా 458 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో సాధారణ కేంద్రాలు 289, సున్నితమైన కేంద్రాలు 101, అతి సున్నితమైన కేంద్రాలు 59 ఉన్నట్లు గుర్తించామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు రిజర్వ్‌ సిబ్బందితో కలసి మొత్తం 3,298 మంది సిబ్బందిని కేటాయించామన్నారు. వీరిలో 23 మంది జోనల్‌ అధికారులు, 61 మంది రూట్‌ అధికారులు, 75 మంది ఎన్నికల అధికారులు, 63 మంది సహాయ ఎన్నికల అధికారులు ఉన్నారన్నారు. అదనంగా మరో 71 మందిని మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు వెల్లడించారు. ఎంపిక చేసిన 36 కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్‌, 351 కేంద్రాల్లో వీడియోగ్రఫీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మున్సిపల్‌ సంబంధించి ఫిర్యాదులు, సమాచారం కోసం 24 గంటలూ పనిచేసేలా 08555–289039 నంబరుతో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు.

పరిషత్‌ ఓటర్లు 11,65,917 మంది..

జిల్లాలోని ధర్మవరం, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సాధారణ ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్‌ అరుణ్‌బాబు, ఎన్నికల పరిశీలకుడు అరుణ్‌బాబు తెలిపారు. ఈ నెల 27వ తేదీన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తామన్నారు. నవంబర్‌ 3న పోలింగ్‌, నవంబర్‌ 5న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 32 జెడ్పీటీసీ స్థానాలకు 316 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలన అనంతరం 234 నామినేషన్లు ఆమోదించినట్లు వెల్లడించారు. అలాగే 297 ఎంపీటీసీ స్థానాలకు 2,521 నామినేషన్లు దాఖలు రాగా, పరిశీలన అనంతరం 1,949 నామినేషన్లు ఆమోదించినట్లు వెల్లడించారు. జిల్లాలో పరిషత్‌ ఓటర్లు 11,65,917 మంది ఉన్నారన్నారు. ఇందులో పురుషులు 5,66,776 మంది కాగా, సీ్త్రలు 5,99,112 మంది, ఇతరులు 29 మంది ఉన్నారని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు 1,320 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇందులో 312 సాధారణ కేంద్రాలు, 469 సున్నితమైన కేంద్రాలు, 539 అతి సున్నితమైన కేంద్రాలుగా గుర్తించామని తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు 103 జోన్లు, 156 రూట్లుగా విభజించి మొత్తం 9,120 మంది పోలింగ్‌ సిబ్బందిని కేటాయించామన్నారు. అతి సున్నితమైన పోలింగ్‌ కేంద్రాల్లో మైక్రో అబర్జర్వర్లు, వెబ్‌క్యాస్టింట్‌ ఏర్పాటు చేయనున్ననట్లు వెల్లడించారు. స్ట్రాంగ్‌ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలు ద్వారా నిరంతర నిఘా ఉంచుతామని వివరించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని, ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు కలెక్టర్‌, ఎన్నికల పరిశీలకులు ఆదేశించారు. సమావేశంలో ఎన్నికల అధికారులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు

అరుణ్‌ బాబు, కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌

స్థానిక ఎన్నికల నిర్వహణపై

కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష

జిల్లాలో 1,778 పోలింగ్‌ కేంద్రాలు, 12,400 మంది సిబ్బంది నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement