ఎన్నికల వేళ మద్యం బంద్‌ | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ మద్యం బంద్‌

Oct 27 2026 12:56 AM | Updated on Oct 27 2026 12:56 AM

● ఈ నెల 30వ తేదీ సాయంత్రం నుంచి

నవంబర్‌ 1వ తేదీ సాయంత్రం వరకు మద్యం దుకాణాల మూసివేత

● కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి

శ్యాంప్రసాద్‌ వెల్లడి

ప్రశాంతి నిలయం: మున్సిపల్‌ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్‌ కానున్నాయి. ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్‌ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి శ్యాం ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. అలాగే ఓట్ల లెక్కింపు సందర్భంగా నవంబర్‌ 3వ తేదీ కూడా మద్యం దుకాణాలను మూసివేయాలన్నారు. మద్యం దుకాణాల యజమానులు ఎన్నికల నిబంధనలను తప్పని సరిగా పాటించాలన్నారు.

విద్యాసంస్థలకు సెలవులు..

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాలుగా ఉన్న విద్యాసంస్థలకు ముందురోజైన అక్టోబర్‌ 31వ తేదీన సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి శ్యాంప్రసాద్‌ తెలిపారు. అలాగే ఓట్ల లెక్కింపు సందర్భంగా నవంబర్‌ 3వ తేదీన ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా ఉన్న విద్యాసంస్థలకు సెలవు ఇచ్చినట్లు ఆయన సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌, ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్ల కోసం పాఠశాలల, కళాశాలలను వినియోగిస్తున్న నేపథ్యంలో ఆయా విద్యాసంస్థలకు సెలవులను ప్రకటిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు వెలువరించారు.

నామినేషన్‌ విత్‌డ్రా కుట్ర బట్టబయలు

● అభ్యర్థి సంతకాన్ని ఫోర్జరీ చేసి

ప్రపోజర్‌ ద్వారా విత్‌డ్రా చేసిన వైనం

● ప్రపోజర్‌ ఉంటే చాలన్న

కమిషనర్‌ ఆడియో వైరల్‌

హిందూపురం(చిలమత్తూరు): మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలో అధికారుల కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అభ్యర్థి లేకుండానే ప్రపోజర్‌తోనే నామినేషన్‌ ఉపసంహరణ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. అభ్యర్థి అనుమతి లేకుండా నామినేషన్‌ ఉపసంహరణకు అవకాశమే లేకపోగా, తన ప్రమేయం లేకుండానే నామినేషన్‌ ఉపసంహరణ జరిగిందంటూ 24వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కార్తిక్‌ ఫిర్యాదు చేసేందుకు కమిషనర్‌ మల్లికార్జున వద్దకు వెళ్లగా, అభ్యర్థి లేకున్నా ప్రపోజర్‌ ఉంటే ఉపసంహరణ చేయొచ్చని కమిషనర్‌ మాట్లాడిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభ్యర్థి ధ్రువీకరణ లేకుండా ప్రతిపాదకుడి అనుమతితో నామినేషన్‌ ఎలా ఉపసంహరించారని అభ్యర్థి ప్రశ్నించడం విశేషం. కాగా ఎన్నికల అధికారులు స్వతంత్ర అభ్యర్థికి బ్యాట్‌ గుర్తు కూడా కేటాయించినట్టు చూపే అధికారిక పత్రం కూడా వైరల్‌ అవుతోంది. ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయిస్తామని బాధితులు కమిషనర్‌ మల్లికార్జునకు తెలపగా, నిరభ్యంతరంగా ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోవచ్చని నిర్లక్ష్యంగా ఆయన సమాధానమివ్వడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement