ముదిగుబ్బ: మండల పరిధిలోని రాళ్లనంతపురం క్రాస్ సమీపంలో సోమవారం ద్విచక్ర వాహనం అదుపు తప్పి నగేష్ (44) మృతి చెందాడు. సీఐ రామసుబ్బయ్య వివరాల మేరకు.. బుక్కపట్నం మండలం మారాలకు చెందిన నగేష్ బత్తలపల్లి నుంచి పశువుల దాణా తీసుకొని వెళ్తున్నాడు. రాళ్లనంతపురం గ్రామ సమీపంలోకి రాగానే ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడ్డాడు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
లేపాక్షిలో మరొకరు..
లేపాక్షి: మండలంలోని శిరివరం గ్రామానికి చెందిన మంజునాథ్ (55) కంచిసముద్రం సమీపంలో సోమవారం ద్విచక్ర వాహనం అదుపు తప్పి మృతి చెందాడు. వివరాలు... మంజునాథ్ కంచిసముద్రంలోని బ్యాంకులో పని ముగించుకుని సొంత గ్రామానికి బయలు దేరాడు. అయితే కంచిసముద్రం దాటిన అనంతరం రోడ్డులో ఉన్న మిట్టను చూడకుండా వెళ్లడంతో వాహనం అదుపు తప్పడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య సరోజమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


