ధర్మవరం రూరల్: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అధికార పార్టీ ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. అధికారంలో ఉన్నాం.. అందినకాడికి దోచుకుందాం అన్నధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, అరాచకాలకు అంతేలేకుండా పోతోంది. అంతటితో ఆగకుండా ఆలయ భూములనూ ఆక్రమించేస్తున్నారు. అధికార పార్టీ నేతలు రూ.10 కోట్ల విలువజేసే పోతుకుంట పోతలయ్యస్వామి ఆలయ భూమి దొంగ పట్టాలు సృష్టించి ఆక్రమణకు యత్నించగా.. గ్రామస్తులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు.
ధర్మవరం మండలంలోని పోతుకుంట రెవెన్యూ గ్రామ పరిధి సర్వే నంబర్ 582లో పోతలయ్య స్వామి ఆలయానికి ఆనుకొని 92 సెంట్ల ఆర్‌అండ్‌బీ భూమి ఉంది. ఈ స్థలంలోనే స్వామి వారి జాతర, పన్నేరపు బండ్లు, బోనాలు తదితర వాటిని నిర్వహించడం ఆనవాయితీ. రూ.10 కోట్ల విలువజేసే ఈ స్థలంపై ‘పచ్చ’నేతల కన్ను పడింది. దీంతో నకిలీ పట్టాలు సృష్టించి ఆర్‌అండ్‌బీ స్థలంలో మంగళవారం ఏకంగా కంచె వేయడానికి యత్నించారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. విషయాన్ని తహసీల్దార్ దేవరాజ్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆలయ భూమి ఆన్యాక్రాంతాన్ని ఉపేక్షించేదిలేదు..
ఈ సందర్భంగా గ్రామస్తులు బోగే శ్రీనివాసరెడ్డి, పైటే సాయి కృష్ణ, వెంకటేష్, పూజారి పోతలయ్య, రామ్మోహన్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, నరసింహారెడ్డి, రామకృష్ణారెడ్డి, నలపరెడ్డి, శ్రీనాఽథ్, బిల్లే శ్రీనివాసులు, రామచంద్ర, ఓబిరెడ్డి తదితరులు
మాట్లాడారు.ఆర్‌అండ్‌బీ స్థలాన్ని కబ్జాకు పాల్పడుతున్నారని రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులకు తెలియజేసినా స్పందించడం లేదన్నారు. వందల ఏళ్లుగా ఆర్‌అండ్‌బీకి చెందిన స్థలంలోనే పోతులయ్య స్వామి ఆలయ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రూ.10 కోట్లు విలువ చేసే భూమిపై అధికార పార్టీ నాయకుల కన్ను పడిందన్నారు. నకిలీ పట్టాలు సృష్టించి భూమిని కొట్టేసేందుకు యత్నించారన్నారు. ప్రభుత్వ భూమిలో కంచె వేస్తున్నారని తెలియడంతో అడ్డుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూమికి పట్టా ఇచ్చిన అధికారి ఎవరని ప్రశ్నిస్తే దౌర్జన్యానికి దిగుతున్నారన్నారు. ఆలయ అవసరాలకు వినియోగిస్తున్న భూమి అన్యాక్రాంతాన్ని ఉపక్షించబోమని, కూటమి నాయకుల దుశ్చర్యలు పోతులయ్య స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ.10 కోట్ల విలువజేసే భూమిపై కన్నేసిన కూటమి నేతలు
దొంగ పట్టాలు సృష్టించి కబ్జాకు యత్నం
ఫెన్సింగ్ పనులు చేస్తుండడంతో అడ్డుకున్న గ్రామస్తులు
ప్రలోభాలకు గురిచేశారంటున్న ఆలయ పూజారి
ప్రలోభాలకు లొంగకుంటే బెదిరిస్తున్నారు..
స్వామి వారికి పూజలు చేయకుండా వెళ్లిపోవాలని కొందరు నాయకులు ప్రలోభాలకు గురి చేయడమే కాక బెదిరింపులకు దిగారు. ఈ స్థలాన్ని పట్టించుకోకుంటే రూ.20 లక్షలు ఇస్తామన్నారు. అలానే గుడికి కూడా కొంత సొమ్ము అందిస్తామని చెప్పారు. గుడి ముందు కొంత మేర స్థలాన్ని వదులుతామని, కబ్జా అంశంపై ఎక్కడా మాట్లాడవద్దని ఆశ పెట్టారు. తాను ప్రలోభాలకు లొంగనని, బెదిరింపులకు భయపడనని కబ్జాదారులకు తేల్చిచెప్పాను. తరతరాలుగా తమ కుటుంబం స్వామి వారికి దీపారాధన చేస్తూ వస్తున్నామని, స్వామి వారి ప్రత్యేక కార్యక్రమాల సమయంలో భక్తుల అవసరాలకు వినియోగిస్తున్న ప్రభుత్వ భూమిపై కొందరి నాయకుల కన్ను పడటం తీవ్రంగా బాధిస్తోంది.
– పూజారి పోతలయ్య, పోతుకుంట


