హిందూపురం టౌన్: లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి మిస్సింగ్ కేసు విషయంలో ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. మంగళవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో రూరల్ సీఐ జనార్దన్, టూటౌన్ సీఐ కరీంతో కలిసి హిందూపురం సబ్‌డివిజన్ ఏఎస్పీ మహేష్ వివరాలు వెల్లడించారు. లేపాక్షి పోలీస్ స్టేషన్‌న్‌లో ఈనెల 24న యువతి మిస్సింగ్ కేసు నమోదైంది. 25న మిస్సయిన యువతి షాహినా, వడ్డే శీన ఇద్దరూ లేపాక్షి పోలీస్ స్టేషన్‌లో హాజరయ్యేందుకు వెళ్తుండగా.. యువతి బంధువులైన జీషాన్, ఆరీఫ్, అబ్రార్, ఇస్మాయిల్ నలుగురు రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చి వారి వాహనాన్ని అడ్డగించారు. ఈ క్రమంలో వడ్డే శీన ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఆయన కుడి కాలికి తీవ్ర గాయమైంది. ఈ ఘటనపై లేపాక్షి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. నిందితుల్లో ఆరిఫ్, అబ్రార్, ఇస్మాయిల్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా తమ కుమార్తె మిస్సింగ్ కావడానికి బీజేవైఎం మండల అధ్యక్షుడు ఈశ్వర్ ప్రసాద్ కారణమని యువతి తండ్రి అక్బర్ బాషా, బంధువు ఇస్మాయిల్‌తో కలిసి ఈశ్వర్ ప్రసాద్ ద్విచక్ర వాహనాన్ని అడ్డగించి దాడి చేసినట్లు ఈ నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు : ఏదైనా సమస్య లేదా వివాదం తలెత్తినప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ సూచించారు. లేపాక్షి మండల పరిధిలో జరిగిన పలు ఘటనలను ఆయన వివరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో లేపాక్షి ఎస్‌ఐ నరేంద్ర, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గుర్తు తెలియని శవమంటూ పుకార్లు
పుట్టపర్తి టౌన్: పట్టణ పరిధిలోని ఎనుముపల్లి గ్రామంలో రైతు దూదేకులు బాబయ్య పొలం సమీపంలో గుర్తు తెలియని శవం లభ్యమైనట్లు పుకార్లు వ్యాపించాయి. శవం గుర్తు పట్టని స్థితిలో ఉందని ఎముకలు, షార్ట్, చేతికి రాఖీ ఉన్నట్లు గొర్రెల కాపరులు తెలపడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అది తమ పరిధి కాదంటూ అటు పుట్టపర్తి అర్బన్ పోలీసులు, రూరల్ పోలీసులు పట్టించుకోలేదు. పైగా తాము ఎస్‌ఎంసీ ఎన్నికల్లో నిమగ్నమై ఉన్నామని తెలిపారు. దీంతో గ్రామస్తులు తహసీల్దార్ సంహితకు తెలపగా...ఆమె సంఘటన స్థలానికి నౌకర్ల పంపి విచారించారు. గొర్రెలకాపరులు చెప్పినట్లుగా అక్కడ శవం లేదని, కనీసం ఆనవాళ్లుకూడా కనిపించలేదని ఆమె తెలిపారు. అయితే పశువుల కాపరులు చూశామంటున్న శవం...ఆ తర్వాత కనిపించకపోవడంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


