ఊబిచెర్లలో భూమాయ | - | Sakshi
Sakshi News home page

ఊబిచెర్లలో భూమాయ

Sep 30 2026 12:22 AM | Updated on Sep 30 2026 12:22 AM

నల్లచెరువు: డిజిటల్‌ భూ సర్వే (రీ–సర్వే) తర్వాత రైతులకు రెవెన్యూ అధికారులు అందించిన డిజిటల్‌ భూమి పాస్‌పుస్తకాల్లో భూమి వివరాలు సరిగా నమోదు కాకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని ఊబిచర్ల పంచాయతీలో సుమారు 750 మందికి పైగా రైతులకు పాసుపుస్తకాలు ఉన్నాయి. అయితే తరతరాలు సాగు చేసుకుంటున్న భూమికి రీసర్వే పూర్తి చేసి ఇటీవల రైతులకు కొత్త పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. అయితే ఆయా రైతులకు సంబంధించిన సర్వే నంబర్లు, విస్తీర్ణం కనిపించకుండా పోయాయని కొందరికి వేరే రైతుల పేర్లు రావడం మరి కొందరికి ఉన్న భూమికంటే తక్కువ విస్తీర్ణం నమోదు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీసర్వేలో జరిగిన తప్పిదాల వల్ల తమ భూములు పాసు పుస్తకాల్లో మాయమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తూ వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ రవికుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బాధిత రైతులు తహసీల్దార్‌ రవినాయక్‌కు మంగళవారం వినతిప్రతం అందజేశారు. అధికారులు క్షేత్ర స్థాయికి వచ్చి పరిశీలించకుండానే ఆన్‌లైన్‌ చేయడం వల్లే ఈ సమస్య తలెత్తిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. భూమి వివరాలు సరిగా లేకపోవడంతో బ్యాంకు రుణాలు, సంక్షేమ పథకాలు అందుతాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ రవికుమార్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు భూమి హక్కులు కల్పిస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం రోడ్డుపాలు చేస్తోందన్నారు. ఊబిచెర్లలో ఎంతోమంది రైతుల భూమి రికార్డులు తారుమారయ్యాయన్నారు. ఐదెకరాలకు పైగా భూమి ఉన్న రైతు పాసుపుస్తకంలో కేవలం 0.01 సెంటు అని నమోదు చేయడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. దామ నరసింహారెడ్డి మాట్లాడుతూ తనకు 4.92 ఎకరాలు భూమిని 1.12కు తగ్గించి పాసుపుస్తకం అందజేశారన్నారు. రొద్దం కృష్ణారెడ్డి మాట్లాడుతూ తనకున్నది 4.80 ఎకరాలు అయితే రీసర్వేలో ఏకంగా 7.56 ఎకరాలు అని పాసుపుస్తకం అందించారన్నారు. కోనపల్లి నరసింహారెడ్డి మాట్లాడుతూ తనకు 5.12 ఎకరాలు భూమి ఉందని, కానీ రీసర్వే తర్వాత 0.01 సెంటు భూమి అని రికార్డుల్లో నమోదు చేశారన్నారు.

డిజిటల్‌ పాసుపుస్తకాల్లో కనిపించని సర్వే నంబర్లు, విస్తీర్ణం

750 మంది రైతుల్లో ఆందోళన

మారిన రైతుల పేర్లు.. కొందరికి తక్కువ విస్తీర్ణం

రైతులకు న్యాయం చేస్తాం

ఊబిచర్ల పంచాయతీకి సంబంధించిన రైతుల సమస్య మాదృష్టికి వచ్చింది. రీసర్వే నమోదులో దొర్లిన సాంకేతిక, క్షేత్ర స్థాయి తప్పిదాలపై సత్వరమే విచారణకు ఆదేశిస్తాం. రెవెన్యూ సిబ్బందిని పొలాల వద్దకు పంపి రికార్డులను మరోసారి పరిశీలిస్తాం. ఏ ఒక్క రైతకూ నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాం.

– రవినాయక్‌, తహసీల్దార్‌, నల్లచెరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement