కదిరి అర్బన్: ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ ప్రసాద్‌రెడ్డిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కదిరి ఆర్టీసీ డిపోలో హయ్యర్ బస్సుల డ్రైవర్లు మంగళవారం అరగంట పాటు సర్వీసులు నిలిపేసి ఆందోళన చేశారు. వారు మాట్లాడుతూ అనంతపురం సమీపంలో కదిరి – అనంతపురం వెళ్తున్న అద్దెబస్సు డ్రైవర్ ప్రసాద్‌రెడ్డి ప్రయాణికురాలిని కించపరిచే విధంగా మాట్లాడాడని ఆమె తరఫు బంధువులు దాడి చేయడం తగదన్నారు. అనంతపురం సమీపంలో డ్రైవర్‌పై సదరు మహిళ భర్త అనిల్, వారి బంధువులు మరో నలుగురు దాడి చేసి గాయపరిచారన్నారు.
మద్యం మత్తులో
అక్కా చెల్లెళ్లపై దాడి
కదిరి టౌన్: మద్యం మత్తులో అక్కా చెల్లెళ్లపై తమ్ముడు ఆజాద్ ఖాన్ దాడి చేసిన ఘటన మంగళవారం కదిరి అడపాల వీధిలో చోటు చేసుకుంది. షేక్ షబానా ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఆజాద్‌ఖాన్ చెల్లెలు అర్షియా తన భర్తతో గొడవపడి మూడు రోజులుగా అక్క ఇంట్లో ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న ఆజాద్ ఖాన్ ఈనెల 27న రాత్రి సుమారు 11 గంటల సమయంలో మద్యం సేవించి షబానా ఇంటి వద్దకు వచ్చి అర్షియాకి ఆశ్రయం ఇచ్చినందుకు షబానారు దూషించాడు. ఆమైపె దాడి చేసి గాయపరిచాడు. అడ్డుకోబోయిన అర్షియాపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె గొంతు,చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు గమనించి అతన్ని వారించగా చంపేస్తానని బెదిరించాడు. గాయపడిన ఇద్దరు మహిళలు కదిరి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు.
టీడీపీ కార్యకర్త దౌర్జన్యం
తాడిమర్రి: మండలంలోని దాడితోటలోని వైఎస్సార్‌సీపీ కార్యకర్త సరిబాల రాజారెడ్డికి చెందిన వ్యవసాయ పైపులను టీడీపీ కార్యకర్త పెనికలపాటి రంగయ్య ధ్వంసం చేశాడు. బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త సరిబాల రాజారెడ్డి తనకున్న మూడెకరాల పొలంతోపాటు తన తమ్ముడి సరిబాల సుధాకర్‌రెడ్డికి చెందిన మరో మూడెకరాల్లో అరటి పంట సాగు చేస్తున్నారు. పొలానికి సమీపంలోని చిత్రావతి నదిలో బోర్లు వేసుకొని పైపులైను ద్వారా పొలానికి నీరు తరలిస్తున్నారు. చిత్రావతి నది ఒడ్డున బాట్లమ్మ అమ్మవారి ఆలయం పక్కన ఉన్న శివాయ సాగు భూమిలో పైపులు వేసుకున్నాడు. అయితే పొరుగున ఉన్న పొలం రైతు, టీడీపీ కార్యకర్త పెనికలపాటి రంగయ్య ఆ భూమిని తన భూమిలో కలుపుకోవాలనే ఉద్దేశంతో ఆ భూమిలో ఉన్న పైపులైన్‌ను ధ్వంసం చేశాడు. అయితే పంచాయితీ చేసి నష్టపరిహారం కట్టిస్తారని వేసి చూసినట్లు బాధితుడు తెలిపారు. పది రోజులు గడిచినా పట్టించుకోకపోవడంతో చివరకు తాడిమర్రి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
ఆస్పత్రిలో మహిళ మృతిపై విచారణ
హిందూపురం టౌన్: స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పాము కాటుకు గురై ఆస్పత్రిలో మహిళ మృతిచెందిన ఘటనపై వైద్యుల బృందం విచారణ చేపట్టింది. ఈ నెల 25న పరిగి మండలం కాలువపల్లికి చెందిన రామాంజనమ్మ (45) పాముకాటుకు గురై హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఘటనపై జిల్లా కలెక్టర్, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. డాక్టర్లు వెంకటరమణనాయక్, శివప్రసాద్ నాయక్‌లను విచారణ అధికారులుగా నియమించారు. ఈ నేపథ్యంలో మంగళవారం వారు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. తొలుత బాధిత కుటుంబ సభ్యులను విచారించారు. తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యంతోనే రామాంజనమ్మ మృతి చెందిందని బాధితులు ఆవేదన చెందారు. తమకు న్యాయం చేయాలని కోరారు. డాక్టర్, నర్సింగ్ సిబ్బంది, ఆస్పత్రి సిబ్బందిని ఘటనపై విచారించారు.


