కదిరి టౌన్: కదలని బండికి మరమ్మతుల పేరుతో బిల్లులు చేసుకొని మెక్కేశారు కదిరి మున్సిపాలిటీ అధికారులు. కదిరి మున్సిపాలిటీ పారిశుధ్య వాహనం (ఏపీ39ఎక్స్2793) తుప్పుబట్టిపోయింది. రెండేళ్లుగా దాన్ని వినియోగించడం లేదు. అయితే సచివాలయ ఉద్యోగి పరమేష్ తప్పుడు బిల్లులు సృష్టించి రూ.2.30 లక్షలు స్వాహా చేశాడు. వేరే వాహనాల ఫోటోలను ఉపయోగించి వాహనానికి మరమ్మతు చేసినట్లు చూపించారు. కాంట్రాక్టర్ ఎ.బయప్పరెడ్డి పేరుతో ఎస్టిమేషన్, కొటేషన్ పత్రాలతో డబ్బు నొక్కేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ సందీప్ సంతకాలతో ఉన్న ఎం బుక్ ఫైళ్లు 943160, 943166, 943170 పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సచివాలయ ఉద్యోగి అయినా...
వాస్తవానికి నిజాంవలి కాలనీ సచివాలయ వార్డు శానిటేషన్ సెక్రటరీగా పనిచేయాల్సిన పరమేష్ పైరవీలతో కమిషనర్‌కు పీఏగా కొనసాగుతున్నారని చెబుతున్నారు. దీన్నే అస్త్రంగా చేసుకొని మున్సిపల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ డీజిల్, వాహన రిపేర్ల పేరుతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారంటున్నారు. ఒక ప్రజాప్రతినిధితో పాటు గతంలో పనిచేసిన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఓ అధికారి ఆధ్వర్యంలో చక్రం తప్పారంటున్నారు. వాహనం రిపేరీ బిల్లులే కాకుండా కొన్నేళ్లుగా కదిరి నియోజకవర్గంలోని వివిధ శాఖల్లో జరిగిన పనులు, టెండర్ల, కాంట్రాక్టులు, వాహన రిపేర్లు, డిజిల్ కొనుగొళ్లు, బిల్లులు, చెల్లింపులపై కూడా ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే రిపేరీల బిల్లులు, ఎం బుక్‌లు, ఎస్టిమేషన్లు, కొటేషన్లు, వర్క్ ఆర్డర్లు, ఓచర్లు పరిశీలించాలని, అలాగే పైళ్లను పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తే అన్ని నిజాలు బయట పడతాయని స్థానికులు చెబుతున్నారు.
అడిగితే సంతకం చేశా...
ఈ వ్యవహారంపై గతంలో ఇన్‌చార్జ్ కమిషనర్‌గా ఉన్న సందీప్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా తాను ఏ తప్పుచేయలేదని, బిల్లులు కూడా పెట్టలేదన్నారు. ఎంబుక్‌లో మూడుచోట్ల సంతకాలు ఎలా చేశారని ప్రశ్నించగా.. అడిగితే సంతకం పెట్టాను కాని బిల్లులు చేయలేదన్నారు.
కదిరి మున్సిపాలిటీలో బట్టబయలైన అవినీతి
రిపేరీ బిల్లుల పేరుతో దాదాపు రూ.2.30 లక్షలకుపైగా స్వాహా
ఎంబుక్‌లపై అధికారుల సంతకాలు


