ధర్మవరం: ఎల్‌నినో కంటే ఎల్లో ప్రభుత్వమే రైతులను దెబ్బతీస్తోందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మంగళవారం బత్తలపల్లి మండల పరిధిలోని ఈదుల ముష్టూరులో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు ఆయన ఎదుట సమస్యలను ఏకరువు పెట్టారు. తొలుత రైతు పెద్దన్న మాట్లాడుతూ పొలంలో బోరు బావులు ఎండిపోవడంతో ఈ రెండేళ్లలో ఏకంగా 16 దాకా బోర్లు వేసినా చుక్క నీరు పడక పోవడంతో అప్పుల పాలైనట్లు కన్నీటి పర్యంతమయ్యారు. చేసేది లేక 300 దాకా చీనీ చెట్లును తొలగించానని, బోర్లు వేసేందుకు రూ.14 లక్షల దాకా అప్పులు చేశామన్నారు. రైతులు బత్తిని శ్రీనన్న, శివమ్మలు మాట్లాడుతూ పొలంలో నీళ్లు చాలక పోవడంతో పశుగ్రాసం కూడా దొరకక రూ.90 వేలకు కొనుగోలు చేసిన పశువులను రూ.25 వేలకే అమ్ముకున్నామన్నారు.
నీళ్లు వదలకపోతే ఎడారి కావడం ఖాయం
ధర్మవరం నియోజకవర్గంలో అవగాహన లేని పాలకుల చేతకాని తనంతోనే రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. బత్తలపల్లి మండలంలోని ఈదుల ముష్టూరు, ఎర్రాపల్లి, పోట్లమర్రిలకు పీఏబీఆర్ కుడి కాలువ ద్వారా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా నీరు వదిలి చెరువులు, కుంటలకు నీళ్లు వదిలారన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో నీళ్లు వదలకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని శారస్త్‌రవేత్తలు ముందే హెచ్చరించినా రావాల్సిన నీటిని చెరువులకు వదలలేదన్నారు. ఫలితంగా ఈ యేడాది వర్షాలు కురవక భూగర్భ జలాలన్నీ అడుగంటి పోయాయన్నారు. తప్పు ఎల్‌నినోది కాదని ఎల్లో ప్రభుత్వానిదేనన్నారు. వాటర్ మ్యాన్ అంటూ ప్రచారం చేయించుకోవడం, డాక్టరేట్లను డబ్బులిచ్చి కొనడం వంటి షోలు మానేసి రైతాంగ సమస్యలపై దృష్టి సారించాలని మంత్రి సత్యకుమార్‌కు కేతిరెడ్డి చురకలంటించారు. పీఏబీఆర్ నీటిని కాలువల ద్వారా వదిలి భూగర్భ జలాలు పెంపొందించకపోతే ధర్మవరం నియోజకవర్గం ఎడారి కావడం ఖాయమన్నారు. నీటి విడుదల కోసం ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ గొల్లపల్లి రామకృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ వెంగళరెడ్డి, మండల కన్వీనర్ గుమ్మళ్లగుంట జయరామిరెడ్డి, మాజీ కన్వీనర్ బగ్గిరి బయపరెడ్డి, జిల్లా కమిటి నాయకులు ముష్టూరు నరసింహారెడ్డి, కోటి సురేష్, కోటి నరేష్‌కుమార్, నాయకులు జాంపుల చంద్రమోహన్, యోగానందాచారి, బండి వీరనారప్ప, ఈడిగ కాశప్ప, రాజవీరారెడ్డి, దివాకర్‌రెడ్డి, మల్లిరెడ్డి,శ్రీనివాసరెడ్డి బ్రదర్స్, అక్కిం దామోదర్, కొండారపల్లి ఈశ్వరయ్య, రాంభూపాల్‌రెడ్డి, బండి నాగభూషణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి


