నేడు వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం

Sep 9 2026 12:11 AM | Updated on Sep 9 2026 12:11 AM

పెనుకొండ రూరల్‌: స్థానిక సంస్థల సమరానికి వైఎస్సార్‌సీపీ సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా బుధవారం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని పట్టణంలోని ఎన్‌ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9.00 గంటలకు విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమవుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

గుక్కెడు నీళ్లివ్వండి సారూ..

తనకల్లు: మండల పరిధిలోని కోటపల్లిలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మహిళలు ఖాళీ బిందెలతో కోటపల్లి– మల్లిరెడ్డిపల్లి రోడ్డుపై మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు మహిళలు మాట్లాడుతూ మంచినీటి బోర్లు పనిచేయకపోవడంతో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. తాగునీటి కోసం ప్రభుత్వం వేయించిన బోర్లలో నీరు రాకపోవడంతో కిలో మీటర్ల దూరంలోని వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి రైతులకు బతిమాలి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. తాగునీటి సమస్యతో నెలల తరబడి ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికై నా సమస్యను పరిష్కరించకపోతే మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట పెద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

అర్హులందరికీ పింఛన్‌ అందాలి

ధర్మవరం అర్బన్‌: అర్హత కలిగిన వారందరికీ సామాజిక పింఛన్‌ అందేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ధర్మవరం పట్టణంలోని 15వ వార్డు గాంధీనగర్‌ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో నూతన పింఛను దరఖాస్తుల స్వీకరణ, వెరిఫికేషన్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ... ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించాలన్నారు. దరఖాస్తుల వెరిఫికేషన్‌, ఈ–కేవైసీ నమోదులో జాప్యానికి తావులేకుండా నిర్దేశిత సమయానికే అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఆర్డీఓ రామభూపాల్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట రమణయ్య, సచివాలయ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, డిజిటల్‌ అసిస్టెంట్‌లు తదితరులు పాల్గొన్నారు.

పరిశ్రమలకై నా సరే

రిజిస్ట్రేషన్‌ చేయను

ఏపీఐఐసీ, ‘పురం’ సబ్‌ రిజిస్ట్రార్‌ మధ్య వాగ్వాదం

చిలమత్తూరు: పరిశ్రమలకై నా డీ నోటిఫై చేసినట్టు ఆధారాలు ఇస్తేనే రిజిస్ట్రేషన్‌ చేస్తానంటూ సబ్‌ రిజిస్ట్రార్‌ రాజశేఖర్‌ ఏపీఐఐసీ అధికారులతో దురుసుగా మాట్లాడటం కలకలం రేపుతోంది. కొటిపి ఎంఎస్‌ఎంఈ పార్కులో మొత్తం 72.95 ఎకరాలు భూమి ఉండగా, వాటిలో ముగ్గురుకి 15 సెంట్లు చొప్పున రిజిస్ట్రేషన్‌ చేయించడానికి ఏపీఐఐసీ అధికారులు మంగళవారం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చారు. ఏపీఐఐసీ అధికారులు ఏ భూమి అయితే చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు రిజిస్ట్రేషన్‌ చేయించాలనుకున్నారో ఆ భూమి ప్రొహిబిటెడ్‌ లిస్ట్‌లో ఉండటంతో దాన్ని సాకుగా చూపి సబ్‌ రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌కు నిరాకరించారు. అలాగే మరో సబ్‌రిజిస్ట్రార్‌ వాటిని రిజిస్ట్రేషన్‌ చేస్తారని, ఆయన సెలవులో ఉన్నారని, ఆయన వచ్చిన తరువాత చేయించుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో ఏపీఐఐసీ అధికారులు ఆగ్రహించి పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ఇలా అసంబద్ధమైన కారణాలు చూపడం సరికాదన్నారు. డీనోటిఫై చేసిన ఆధారాలు తీసుకురండి అప్పుడు చేస్తాం అని సమాధానం రావడంతో వారు చేసేది లేక అక్కడి నుంచి వెనుదిరిగారు. అయితే ఎమ్మెల్యే పీఏలే రిజిస్ట్రేషన్‌ జరగకుండా ఆపారన్న చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement