ఎన్‌పీకుంట: ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపర్చిన కేసులో ముద్దాయికి కదిరి అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఎస్‌ఐ కృష్ణమూర్తి వివరాలమేరకు... మండల పరిధిలోని ఎగువతూపల్లికి చెందిన కుప్పాల గంగప్ప గత ఏడాది నవంబర్ 24న మల్లెం శ్రీరాములు అనే వ్యక్తి జేసీబీతో చేస్తున్న రోడ్డు పనులను పర్యవేక్షిస్తుండగా అతనితో గొడవపడి దాడి చేసి గాయపరిచాడన్నారు. బాధితుడి ఫిర్యాదుమేరకు అప్పటి ఎస్‌ఐ వలిబాషా కేసు నమోదు చేసి ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని తెలిపారు. కదిరి అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ సాక్ష్యాలను పరిశీలించి ముద్దాయికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారన్నారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా నాలుగు నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పుఇచ్చినట్లు పేర్కొన్నారు. సకాలంలో సాక్ష్యులను హాజరుపరచి ముద్దాయికి శిక్షపడేలా చేసిన ఎస్‌ఐ కృష్ణమూర్తి, కోర్టు కానిస్టేబుల్ శేషగిరి, అధికారులు, సిబ్బందిని ఎస్పీ సతీష్‌కుమార్ అభినందించనట్లు తెలియజేశారు.
సమ్మెలోకి ‘సత్యసాయి’ తాగునీటి కార్మికులు
ముదిగుబ్బ: సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు కార్మికులు మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్లారు. ఇందులో భాగంగానే ముదిగుబ్బ సమీపంలోని పంప్ హౌస్ దగ్గర కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ గత ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇన్నాళ్లూ వేతనాలు అందకపోయినా ఎండ, వాన, పండుగలు, సెలవులు లెక్క చేయకుండా ప్రజలకు తాగునీటి సరఫరా కొనసాగిస్తున్నామన్నారు. వేతనాల కోసం ప్రతిసారి సమ్మె చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. వేతనాలతో పాటు ఉద్యోగ భద్రతకు శాశ్వత పరిష్కారం చూపాలని, అలాగే మృతి చెందిన, రిటైర్డ్ కార్మికులకు రావాల్సిన గ్రాట్యుటీని చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు, ముదిగుబ్బ మండల కార్యదర్శి బాబ్‌జాన్, సీఐటీయు జిల్లా కార్యదర్శి పైపల్లి గంగాధర్, కార్మిక సంఘం నాయకులు మధు, నరేష్, రాజారెడ్డి, వెంకటేష్, బాషా, మిద్ది వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 92 శాతం
పింఛన్ పంపిణీ
పుట్టపర్తి అర్బన్: ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో భాగంగా మంగళవారం ఉదయం కలెక్టర్ శ్యాంప్రసాద్ పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలో పలువురు లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. జిల్లాలోని 2,58,234 మంది లబ్ధిదారులకు రూ.113.88 కోట్లు మంజూరు చేశారు. ఇందులో మొదటి రోజు 2,37,743 మంది లబ్ధిదారులకు రూ.104.14 కోట్లు పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీకి బుధవారం ఆఖరని, తక్కిన మొత్తాన్ని సెర్ప్‌కు తిరిగి చెల్లించాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.
నేరాల నియంత్రణకు
పటిష్ట చర్యలు
పుట్టపర్తి టౌన్: జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ సతీష్‌కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఎస్పీ సతీష్‌కుమార్ సబ్ డివిజన్ల వారీగా నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతలు, పరిరక్షణ, చోరీలు, గ్రేవ్, నాన్‌గ్రేవ్, మర్డర్, ప్రాపర్టీ, చీటింగ్, పెండింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాల చర్చించి దిశా నిర్దేశం చేశారు. స్టేషన్లలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల్లో త్వరగా పురోగతి సాధించాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సున్నితమైన సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రానున్న వినాయక చవితి వేడుకలు ప్రశాంతగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఊరేగింపు మార్గాలు, నిమజ్జన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. రాత్రి సమయాల్లో గస్తీ ముమ్మరం చేసి దొంగతనాలకు చెక్ పెట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డు నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, సీఐలు లింగన్న, లక్ష్మీకాంత్‌రెడ్డి, ఇస్మాయిల్, బొజ్జప్ప, ఏఓ వేణుగోపాల్ పాల్గొన్నారు.


