పుట్టపర్తి: తాగునీటి కోసం నల్లమాడ మండలం రెడ్డిపల్లికి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో మంగళవారం రోడ్డెక్కారు. గుక్కెడు తాగునీళ్లు ఇవ్వలేని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఉన్నా ఒకటే .. రాజీనామా చేసినా ఒకటే అంటూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. నెల రోజుల నుంచి తాగునీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు గంట పాటు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చివరికి ఎస్‌ఐ వచ్చి సంబంధిత అధికారులతో మాట్లాడి నీళ్లు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ మోటారు మరమ్మతుకు గురికావడంతో నెలరోజులుగా నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామన్నారు. వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అసెంబ్లీలో గొప్పలు చెప్పుకోవడం కాదు గ్రామీణ ప్రాంతాల్లో చుక్క నీళ్లు ఇవ్వలేకపోతున్నారు.. మీకెందుకు ఎమ్మెల్యే పదవి అని మండిపడ్డారు. నీటి సమస్య పరిష్కరించకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామన్నారు.
తాగునీళ్లు ఇవ్వలేని ఎమ్మెల్యే
పల్లె సింధూరారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్


