పుట్టపర్తి: జిల్లాలో సోమవారం నుంచి ‘పది’ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు డీఈఓ కిష్టప్ప పేర్కొన్నారు. విద్యార్థులకు ఆయన ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పరీక్షలు ఉదయం 9.30 ప్రారంభమవుతాయని,విద్యార్థులు అర గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలన్నారురు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూం నంబర్ 8328028353కు ఫోన్ చేయాలన్నారు. జిల్లాలో 107 కేంద్రాల్లో 22,303 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని ఆయన వెల్లడించారు. బాలురు 11,098 మంది, బాలికలు 10,236 మంది ఉన్నట్లు చెప్పారు. విద్యార్థులందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని, బస్సు కండక్టర్‌కు హాల్‌టికెట్ చూపితే చాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 200 మీటర్ల వరకూ 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఈ సారి ప్రైవేటు టీచర్లను కూడా ఇన్విజిలేటర్లుగా నియమించినట్లు తెలిపారు. మొత్తం 1,177 మంది ఇన్విజిలేటర్లలో 971 మంది ప్రభుత్వ, 206 మంది ప్రైవేటు ఉపాధ్యాయులు ఉన్నారన్నారు.


