ఏడాదిపాటు వాడాలి | - | Sakshi
Sakshi News home page

ఏడాదిపాటు వాడాలి

Mar 16 2026 7:19 AM | Updated on Mar 16 2026 7:19 AM

పుట్టపర్తి అర్బన్‌: కొండగుట్టల్లో పెరిగే నీలగిరి మొక్కలు ప్రస్తుతం రైతులకు ‘కలప తరువు’గా మారాయి. నీటి అవసరం లేకున్నా పెరిగే మొక్కలు కావడంతో బంజరు, బీడు భూముల్లో పెంచుతున్నారు. గతంలో రైతులు వీటిని పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ ఉద్యాన మొక్కలకు ఊతంగా నిలిపే కర్రలకు కొరత ఏర్పడటం. నీలగిరి అందుకు బాగా ఉపయోగపడటంతో రైతులు వాటిని పెంచుతున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక రాబడి వస్తుండటంతో ఒకరిని చూసి మరొకరు నీలగిరి సాగుకు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు మండలాల్లోని రైతులు నీలగిరి మొక్కలను విపరీతంగా పెంచుతున్నారు.

గతంలో పేపర్‌ మిల్లులకే పరిమితం

నీలగిరి కర్రలను గతంలో ఎక్కువగా పేపర్‌ మిల్లులకు మాత్రమే పంపేవారు. అలాగే ప్లైవుడ్‌ పరిశ్రమలు ఎక్కువగా ఉండే చిత్తూరు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలకు సరఫరా చేసేవారు. కానీ పెద్దగా లాభాలు వచ్చేవి కావు. అందులోనూ మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో పేపర్‌ మిల్లులు మూత పడడంతో నీలగిరికి పెద్దగా డిమాండ్‌ ఉండేది కాదు.

ఉద్యాన పంటలకు వినియోగంతో డిమాండ్‌

నాణ్యమైన కూరగాయలు, పండ్ల దిగుబడికి ప్రతి మొక్కకూ కర్రసాయం అవసరం అవుతోంది. ఈదురు గాలులకు మొక్క కిందపడి విరిగిపోకుండా రైతులు కర్ర సాయాన్ని అందిస్తున్నారు. దీంతో కర్రల వ్యాపారం బాగా పుంజుకుంది. ఒకప్పుడు బంజరు భూములు, బీడు భూముల్లో మాత్రమే సాగు చేసే రైతులు... ప్రస్తుతం సారవంతమైన భూముల్లో సైతం నీలగిరి మొక్కలను సాగు చేస్తుండడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలోనూ నీలగిరి సాగులో ఉంది. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితులకు తట్టుకునే మొక్కలు కావడంతో రైతులు నీలగిరి సాగుకు మొగ్గు చూపుతున్నారు.

15 ఏళ్ల వరకూ దిగుబడి

యూకలిప్టస్‌, జామాయిల్‌, నీలగిరి వంటి పేర్లతో పిలిచే ఈ మొక్క ఒక్కసారి నాటితే 12 నుంచి 15 ఏళ్ల వరకూ దిగుబడి ఇస్తుంది. ప్రతి మూడు నెలలకు ఓ సారి కర్ర నరికి విక్రయించుకోవచ్చు. ఎకరాకు కనీసం 45 నుంచి 60 టన్నుల వరకూ దిగుబడి వస్తుంది. ఈ పంటకు పెట్టుబడి చాలా తక్కువ. సొంత భూములున్న రైతులు సాగు చేసినట్లయితే ఒకటి రెండు సార్లు ఎరువులు, నీళ్లు అందిస్తే సరిపోతుంది.

పెరిగిన సాగు విస్తీర్ణం

జిల్లాలో అత్యధికంగా చిలమత్తూరు, హిందూపురం, మడకశిర, అమడగూరు, తనకల్లు, నల్లచెరువు తదితర మండలాల్లో నీలగిరి పంట సాగవుతోంది. ఓడీసీ మండలం మహమ్మదాబాద్‌, గోరంట్ల మండలం పులేరు, కదిరి, హిందూపురం ప్రాంతాల్లో నీలగిరి మొక్కల విక్రయ కేంద్రాలున్నాయి. ఇక్కడి నుంచే రైతులు కర్రలను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో కర్ర 6 నుంచి 8 అడుగుల వరకు సైజును బట్టి రూ.25 నుంచి రూ.30 వరకూ పలుకుతోంది. స్థానికంగా కర్రలకు కొరత ఏర్పడితే చిత్తూరు, నెల్లూరు, తెలంగాణ నుంచి కర్రలను కొనుగోలు చేసి తీసుకొస్తుంటారు.

కర్ర సాయమిస్తే నాణ్యమైన దిగుబడి

పండ్ల తోటల్లో ముఖ్యంగా టమాట, వంకాయ, బీర, సొర కాయలు, కాకర వంటి తీగ జాతి పంటలకు కర్రలను అధికంగా వినియోగిస్తారు. టమాట, వంకాయ పిందె స్థాయిలోనే కింద పడితే కాయ నాణ్యత దెబ్బతింటుంది. అందువల్ల రైతులు మొక్కలకు కర్రను సాయంగా ఉంచి పంట కాపాడుకుంటారు. ఇక తీగ జాతి పంటలకు తప్పనిసరిగా కర్రల సాయం ఇస్తారు. మామిడి, చీనీ, దానిమ్మ తదితర పండ్ల మొక్కలకు సపోర్ట్‌గా కర్రలు నాటడం వల్ల మొక్కలు గాలికి, వర్షాలకు కింద పడకుండా ఉంటాయి. ఈ క్రమంలోనే నీలగిరి కర్రలకు డిమాండ్‌ పెరగడంతో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు.

కాసులు కురిపిస్తున్న నీలగిరి

కర్ణాటక సరిహద్దులో భారీగా సాగు

ఉద్యాన మొక్కలకు

ఊతంగా నీలగిరి కర్రలు

ఇటీవల భారీగా పెరిగిన డిమాండ్‌

ఒక్కో కర్ర రూ.25 నుంచి

రూ.30 వరకూ విక్రయం

ప్రకృతి వైపరీత్యాల వల్ల మామిడి మొక్కలు దెబ్బ తినకుండా కర్రల సపోర్ట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. మామిడి మొక్కలు పెళుసుగా ఉండడంతో అవి విరగకుండా ఏడాది పాటు కర్రల సపోర్ట్‌ ఉండాలి. ఇందుకోసం మూడు, నాలుగు అడుగుల ఎత్తు ఉన్న కర్రలయితే సరిపోతాయి. అయితే ఇటీవల అటవీ ప్రాంతానికి వెళ్లి కట్టెలు కొట్టే కూలీలు తగ్గిపోవడంతో ఎక్కువగా నీలగిరి కర్రలను కొంటున్నాం. దీంతో నీలగిరి సాగు విస్తీర్ణం కూడా జిల్లాలో పెరిగింది.

– సూర్యనారాయణ, కొత్తచెరువు

Advertisement
 
Advertisement
Advertisement