చీనీకి చీడపీడలు.. | - | Sakshi
Sakshi News home page

చీనీకి చీడపీడలు..

Mar 16 2026 7:19 AM | Updated on Mar 16 2026 7:19 AM

తాడిమర్రి: చీనీ రైతును చీడపీడలు వణికిస్తున్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నల్లితో కాయలకు మంగు సోకడంతో పంటను కొనేందుకు వ్యాపారులు ముందుకు రాక కాయలు చెట్లపైనే పండి రాలిపోతున్నాయి. మరోవైపు పులుసు పురుగు విజృంభించడంతో చెట్లు ఎండిపోతుండగా.. రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

పెరిగిన సాగు విస్తీర్ణం

జిల్లాలో ఎర్ర మట్టి నేలలు అధికంగా ఉండటం, ఇక్కడ పండించే చీనీ కాయలు తీపిగా ఉండటంతో మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. నీటి సౌకర్యం తక్కువగా ఉన్నా... కేవలం డ్రిప్పు ద్వారా నీటి తడులు అందిస్తే పంటను కాపాడుకునే అవకాశం ఉంది. దీంతో జిల్లా రైతులు ఎక్కువ మంది చీనీ తోటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి, బత్తలపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ మండలాల్లో ఏకంగా 37,500 ఎకరాల్లో 4.50 లక్షలు చెట్లు సాగు చేస్తున్నారు.

వర్షాభావం..తెగుళ్ల దాడి

రెండేళ్లుగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బోరు బావుల్లో నీటి మట్టం తగ్గింది. అయినప్పటికీ డ్రిప్పు ద్వారా అష్టకష్టాలు పడి చెట్లను కాపాడుకుంటూ వస్తున్న రైతులకు చీడపీడలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చీడపీడలతో దిగుబడిపై దెబ్బ పడగా..కాస్తో కూస్తో పండిన పంట కూడా నాణ్యత సరిగా లేదని వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో రైతులు నష్టాలపాలయ్యారు.

వ్యాపారులు కొనడం లేదు

ఈ ఏడాది చీనీ దిగుబడి కోసం ఎరువులు అధికంగా వేశా. కాయలు మంచి సైజు వచ్చాయి. దిగుబడి కూడా బాగానే వచ్చింది. అయితే నల్లి పురుగు దెబ్బకు కాయలకు మంగు సోకింది. ఎన్ని రసాయన మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. చీనీకాయలు కోతకు వచ్చినా అడిగే వారే లేరు.

–కుమ్మర ఓబుళపతి, తాడిమర్రి

చెట్లు ఎండిపోతున్నాయి

పులుసు పురుగు సోకడంతో చీనీచెట్లు వాడు పట్టి ఎండిపోతున్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేదు. ఇప్పటికై నా ఉద్యాన శాఖ అధికారులు తోటల్లో పర్యటించి తగిన సూచనలు, సలహాలివ్వాలి.

–అల్లే సాయినాథ్‌రెడ్డి, శివంపల్లి, తాడిమర్రి

నల్లితో కాయలపై నల్లని మంగు

పులుసు పురుగుతో ఎండుతున్న చెట్లు

ఆందోళన చెందుతున్న రైతన్నలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement