తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడండి | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడండి

Mar 16 2026 7:19 AM | Updated on Mar 16 2026 7:19 AM

ప్రశాంతినిలయం: వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో వేసవి సంసిద్ధత, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ పనులు, అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీరు తదితర అంశాలపై సమీక్షించారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద జిల్లాకు మంజూరైన 4,923 వ్యక్తిగత మరుగు దొడ్లలో ఇప్పటి వరకూ 3,725 నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. తక్కిన 1,198 మరుగుదొడ్ల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్‌ గ్రాంట్‌ ద్వారా తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎస్‌బీఎం, ఐసీడీఎస్‌ గ్రాంట్ల కింద అంగన్‌వాడీల్లో 52.15 శాతం మరుగుదొడ్లు, 89.84 శాతం తాగునీటి సరఫరా పురోగతి నమోదైందన్నారు. మడకశిర డివిజన్‌లో 130 కేంద్రాలకు గాను 127 కేంద్రాల్లో పూర్తయ్యాయన్నారు. మార్చి నుంచి జూలై వరకూ తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. కరువు ప్రభావిత మండలాల్లో నీటి రవాణా కోసం రూ.210.92 కోట్లు కేటాయించామన్నారు. మడకశిర నియోజకవర్గంలోని పంచాయతీలకు తాగునీటి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని డీపీఓను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అభ్యాసకులంతా పరీక్షకు హాజరుకావాలి

పుట్టపర్తి అర్బన్‌: అక్షర ఆంధ్ర (ఉల్లాస్‌) ఫైనల్‌ పరీక్షకు అభ్యాసకులందరూ హాజరవ్వాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ అన్నారు. ఆదివారం పుట్టపర్తి మండలం ప్రశాంతిగ్రామంలోని అక్షర ఆంధ్ర పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలన్నదే కార్యక్రమ లక్ష్యమన్నారు. అందరూ అక్షరాస్యులుగా మారి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. పరీక్ష ముగిసిన అనంతరం జవాబు పత్రాలు, అటెండెన్స్‌, అవార్డు లిస్ట్‌లను సంబంధిత వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లకు అప్పగించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వయోజన విద్య నోడలాఫీసర్‌ జనార్దన్‌ గౌడ్‌, సీఎంఎం రమాదేవి, సీఓ ధరణి, ఇన్విలేజర్లు నర్మద, పుష్ప పాల్గొన్నారు.

కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌

Advertisement
 
Advertisement
Advertisement