అనంతపురం ఎడ్యుకేషన్: పంచాయతీల్లో పన్నుల వసూళ్లకు చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న భారీ లక్ష్యాలు పంచాయతీ అధికారుల ప్రాణాలమీదకు వస్తున్నాయి. ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుంచి రాత్రిదాకా ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక కొందరు ఉద్యోగులు మానసిక ఆందోళనకు గురవుతూ అనారోగ్యాల పాలవుతున్నారు. రెండు రోజుల క్రితం గుమ్మఘట్ట డిప్యూటీ ఎంపీడీ చంద్రశేఖర్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన పన్నుల వసూళ్ల ఒత్తిడితోనే జరిగిందని ఉద్యోగులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో చంద్రశేఖర్ ఫొటో పెట్టి...‘పన్నుల వసూళ్లకు డిప్యూటీ ఎంపీడీఓ బలయ్యాడు’ అంటూ పోస్టులు పెట్టారు.
ఇలాంటి ఒత్తిడి ఎన్నడూ చూడలేదు
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక విలేజ్ డెవలప్‌మెంట్ అధికారి పంపిన వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అనంతపురం జిల్లాలోని పలు వాట్సాప్ గ్రూపుల్లో ఈ మెసేజ్ విస్త్తృతంగా ఫార్వర్డ్ అవుతోంది. ఆ వాయిస్ మెసేజ్ లో ఏముందంటే... ‘రోజుకు రూ.10 లక్షల పన్నుల వసూళ్ల లక్ష్యం విధించారు. నా వయసు 57 సంవత్సరాలు. 32 సంవత్సరాలుగా సేవలందిస్తున్నా. అయినా ఇంతటి ఒత్తిడి ఎప్పుడూ చూడలేదు. పన్నుల వసూళ్ల ఒత్తిడితో తీవ్ర మానసిక టెన్షన్ ఎదు ర్కొంటున్నా. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజీనామా చేయాల్సి వస్తుంది. రోజుకు రూ.10 లక్షలు వసూలు చేయాలంటున్నారు.స్వయంగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వచ్చినా అంత మొత్తం వసూలు చేయడం సాధ్యం కాదు. కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు అంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. మాకు కుటుంబాలు లేవా? రెండో శనివారం, ఆదివారం కూడా ఇదే పని చేయాలా? ఒత్తిళ్లు కొనసాగితే తీవ్ర నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. అందుకు ఈఓఆర్డీ, ఎంపీడీఓ, డీపీఓ, కమిషనర్ బాధ్యులవుతారు’ అని మెసేజ్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వాయిస్ మెసేజ్ పంచాయతీ శాఖ ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది.
ప్రభుత్వం పునరాలోచించాలి
జిల్లాలో పని చేస్తున్న గ్రామ అభివృద్ధి అధికారులు (వీడీఓ) తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయాలు మార్చుకోకపోతే తాము అతి తొందరలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ‘మాకూ కుటుంబాలు ఉన్నాయి.. చిన్న వయసులోనే అరోగ్యాలు దెబ్బతింటే మా కుటుంబాలు ఏమి కావాలని’ ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం ఎక్కడో కూర్చుని సంస్కరణల పేరుతో హోదాలు మార్చడం కాదని, ప్రశాంతంగా పని చేసుకునే వాతావరణం కల్పించాలని మండిపడుతున్నారు. జిల్లా అధికారులు కూడా ఈ విషయంలో వైఖరి మార్చుకోవాలని కోరుతున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో యూనియన్ల నాయకులకూ చురకలంటిస్తున్నారు. ‘పనికిరాని ఇన్ని యూనియన్లు ఉండడం వల్లే ప్రతి ఒక్కరూ మనల్ని పురుగులు చూసినట్టు చూస్తున్నారు’ అని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఒత్తిళ్లతో పంచాయతీ
ఉద్యోగుల తీవ్ర ఆవేదన
గుమ్మఘట్ట డిప్యూటీ ఎంపీడీఓ
గుండెపోటుతో మరణించాడంటున్న వీడీఓలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్రీకాకుళం జిల్లా వీడీఓ వాయిస్ మెసేజ్


