ప్రశాంతినిలయం: కలెక్ట రేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్ ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు.
పోలీస్ కార్యాలయంలో..
పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా తెలియజేయాలని సూచించారు.ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు.
‘పురం’ సంతకు 4,560 క్వింటాళ్ల చింతపండు
హిందూపురం: హిందూపురం వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం జరిగిన సంతకు 4,560 క్వింటాళ్ల చింతపండు వచ్చింది. మొదటి రకం బెస్ట్ కరిపులి క్వింటాలు ధర గరిష్టంగా రూ.35 వేలు, కనిష్టం రూ.10 వేలు, సగటు రూ.14 వేల చొప్పున క్రయ విక్రయాలు సాగాయి. రెండో రకం ఫ్లవర్ క్వింటాల్ గరిష్ట ధర రూ.13 వేలు, కనిష్టం రూ.6 వేలు, సగటు రూ.7,500 పలికినట్లు మార్కెట్ కార్యదర్శి నరసింహ మూర్తి తెలిపారు. ఉగాది సందర్భంగా వచ్చే గురువారం చింతపండు మార్కెట్‌కు సెలవు ప్రకటించారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు రిజర్వు ఎస్‌ఐల దుర్మరణం
● కర్ణాటకలోని చెళ్లకెర వద్ద ఘోరం
పావగడ: లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ముగ్గురు రిజర్వ్ ఎస్‌ఐలు దుర్మరణం చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా చెళ్లెకెర తాలూకా హెగ్గెరె గ్రామం వద్ద బెంగళూరు హైవేలో సంభవించింది. బెంగళూరు సాయుధ పోలీసు (సీఏఆర్) విభాగంలో ఎస్‌ఐలుగా పనిచేసే మంజునాథ్ దారిమని (31), అమరీష్ (25), సచిన్ (30), ఎల్.ఈశ్వర్, మహదేశ్వర బొమ్మన్నవర్ స్నేహితులు. తమ బ్యాచ్‌మేట్ పెళ్లి బళ్లారిలో జరుగుతుండడంతో మారుతి సియాజ్ కారులో బెంగళూరు నుంచి ఐదుగురూ బయల్దేరారు. మార్గమధ్యంలోని హెగ్గెరె గ్రామం వద్ద బెంగళూరు– హైవేలో అతివేగంగా కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. కారులోని మంజునాథ్, అమరీష్, సచిన్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈశ్వర్, మహదేశ్వర తీవ్ర గాయాలపాలయ్యారు. కారు ముందు భాగం మొత్తం నుజ్జయింది. మృతులందరూ అవివాహితులే అని తెలిసింది. లారీ డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చెళ్లకెర ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టం గది వద్ద మృతుల తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.


